పవన్ కల్యాణ్ అనే ఒక్క రాజకీయనాయకుడిపై దండయాత్ర చేయడానికి వైసీపీ చేస్తున్న అనైతిక రాజకీయాలు చూసి ప్రజలు కూడా ఔరా అనుకుంటున్నారు. రాజకీయాల్లో సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం ఏమీ లేని నేతలతో బేరమాడి, డబ్బులిచ్చి పదవులు ఆశ చూపి పవన్ పై దాడికి తెగబడేలా చేస్తున్నారు. ముద్రగడతో ప్రారంభించి చాలా మంది నేతల్ని ఇప్పటికే రంగంలోకి దించారు. ఇప్పుడు వారి జాబితాలో పోతిన మహేష్ చేరారు.
అసలు ఎవరీ పోతిన మహేష్. జనసేన అనే పార్టీ లేకపోతే ఎవరికైనా తెలుస్తాడా ?. జనసేన ఆయనకు అవకాశం ఇవ్వబట్టే నలుగురికి పరిచయమయ్యాడు. ఆ పార్టీ తరపున నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవర్ని విమర్శిస్తున్నాడు ?. ఎంత విశ్వాస ఘాతకుడు కాకపోతే పవన్ కల్యాణ్ భార్య ప్రస్తావన తీసుకు వస్తాడు ?. ఇలాంటి వాళ్లు ఇవాళ కాకపోతే.. రేపు అయినా స్వార్థం కోసం పవన్ పై బురద చల్లి వెళ్లిపోతారు. తమ కోసం పవన్ సీటు తీసుకోవాలని పట్టుబట్టకపోవడం సమంజసమేనని వీరు నిరూపిస్తున్నారు.
వైసీపీ ఇలాంటి వాళ్లను పట్టుకుని పవన్ పై దాడి చేయిస్తే.. పవన్ కు నష్టం జరుగుతుందనుకుంటే అంత కంటే రాజకీయ ఆమాయకత్వం ఉండదు. పోతిన మహేష్ పవన్ ను తిట్టడం వల్ల ఎవరికి నష్టం ?. ఖచ్చితంగా పోతిన మహేష్‌కు రేపు.. వైసీపీలో చేరితే.. ఆ పార్టీకి నష్టం. ఎందుకంటే.. అమ్ముడుపోయి తిట్లు అందుకున్నారని సులువుగానే ప్రజలకు అర్థమైపోతుంది. పోతిన మహేష్ మాట్లాడిన మాటలు చూస్తే.. అది ఖచ్చితంగా సజ్జల స్క్రిప్టేనని ఎవరికైనా అర్థమైపోతుంది.
రాజకీయాల్లో ఓపిక అవసరం. చాన్స్ వస్తే ఏకాఏకిన ఎమ్మెల్యే అయిపోయి కోట్లకు అమ్ముడుపోదామని అనుకున్నారేమో కానీ.. తమ రాజకీయ జీవితంలో అది మచ్చగా ఉండిపోతుంది. తర్వాత ఎవరూ పట్టించుకోరు. వైసీపీలో అలాంటి నేతలందర్నీ స్క్రాప్ గా చేర్చి పక్కన పెట్టారు. ఆ జాబితాలో పోతిన మహేష్ కూడా చేరుతాడు. కానీ ఒక లీడర్ ను నేరుగా ఎదుర్కోలేక ఈ అనైతిక రాజకీయాలు ఎందుకన్న ప్రశ్న.. ఎక్కువ మందికి వస్తుంది.ఇది వైసీపీ మార్క్ రాజకీయం అనుకోవాలేమో ?