పార్టీ నేతలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులపై చర్చించి పోరాట కార్యాచరణ ఖరారు చేసుకునేందుకు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్ని స్థాయిల నేతల్ని ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మళ్లీ వెంటనే నిర్వహించడానికి కీలక నిర్ణయం తీసుకోవడానికేనన్న అభిప్రాయం వినిపిస్ోతంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ 3వ తేదీ సాయంత్రం మంగళగిరి చేరుకుంటారు. ఈ సమావేశం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తో పాటు ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహించేందుకు ప్రణాళికలను రెడీ చేయనున్నారు . ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై లోతుగా చర్చిస్తారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ఆమోదిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
జనసేన కార్యకర్తలపై పెడుతున్న కేసుల విషయంలో డీజీపీని కలవాలని పవన్ భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేన కార్యకర్తలపై ఒత్తిడి పెరుగుతోంది. వారికి అండగా ఉండే వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పడకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. దీన్ని అధిగమించడంతో పాటు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో పోరాటం ప్రకటించి.. ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణను పవన్ ఖరారు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.