నిన్న తూర్పు గోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతారు. కేరళలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ తిరిగివచ్చేరు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు లేదా మధ్యాహ్నం 3.00 గంటలకు కానీ ఆయన మీడియాసమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతారని సమాచారం.
పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవడంతో ఆయన మీడియా సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. పవన్ కళ్యాణ్ కి కుల ప్రస్తావన చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితులలో దాని గురించే ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. నిన్న తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలను ఖండించిన తరువాత అటువంటి పరిస్థితులకు దారి తీసిన ఆ ఉద్యమాన్ని తక్షణమే నిలిపివేయమని కాపు సామాజిక వర్గ ప్రజలను కోరవచ్చును. ఆయన తెదేపాకు మిత్రపక్షంగా ఉన్నందున బహుశః ఈ సమస్యపై ప్రభుత్వ కోణంలో నుండి తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చును. ఈ ఉద్యమాన్ని తక్షణమే నిలిపివేయమని ఒకవేళ ఆయన పిలుపునిచ్చినా ఆయన అభిమానులు ఉద్యమం నుండి తప్పుకోవచ్చునేమో కానీ కాంగ్రెస్, వైకాపాలకు చెందినవారు యధావిధిగా కొనసాగించవచ్చును.