జనసేన అధినేత పవన్ కల్యాణ్ తర్వాతి పోరాటయాత్రను… గోదావరి జిల్లాల్లో ప్లాన్ చేసుకున్నారు. పదహారో తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది..? ఏ రూట్ లో సాగుతుందన్న వివరాలు… ఎప్పటికప్పుడు ఖరారు చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలనుకున్నారు. కానీ.. అదే జిల్లాలో .. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర జరుగుతోంది.శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్పడంతో.. పశ్చిమగోదావరి జిల్లాకు పోరాటయాత్రను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
జనసేనకు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఆదరణ ఉంటుందని… మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాల్లో పోరాటయాత్రకు లభించే ఆదరణను బట్టి… జనసేన ప్రభావాన్ని రాజకీయ పార్టీలు కూడా అంచనా వేసుకునే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా… ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు సాదించాలి. లేకపోతే.. మెజార్టీ సాధించడం కష్టం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు జిల్లాల్లో ఘోరంగా దెబ్బతిన్నది. దానికి టీడీపీ – బీజేపీ కూటమికి పవన్ కల్యాణ్ మద్దతివ్వడమే కారణమన్న విశ్లేషణలు చాలా రోజులుగా ఉన్నాయి.
జనసేన స్థాపించి నాలుగేళ్లు దాటుతున్న పవన్ కల్యాణ్ ఇంత వరకూ… ఒక లేయర్ పార్టీ నిర్మాణాన్ని కూడా ప్రారంభించలేదు. అంతో ఇంతో బలం ఉందనుకుంటున్న ఉభయగోదావరి జిల్లాల్లో ప్రముఖ నేతలంటూ జనసేనకు ఎవరూ లేరు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేని కొంత మంది సీనియర్లు పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో.. అటు టీడీపీ, ఇటు వైసీపీ ల్లో అవకాశం దక్కదనుకునేవారు కూడా.. జనవైపు చూస్తారు. పవన్ కల్యాణ్ కాస్తంత రాజకీయంగా ఆలోచిస్తే.. కొన్ని నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు దొరికే అవకాశం ఉంది. పోరాటయాత్రలో పవన్ చేరికలపై దృష్టి పెడితేనే ఇది సాధ్యమవుతుంది.