జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరానికి గురై విశ్రాంతి తీసుకుటున్నారు. అందుకే గురువారం జరిగి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరు కావడం లేదని జనసేన ప్రకటించింది. కొద్ది రోజులుగా బయటకు పవన్ కనిపించడం లేదు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం కూడా చేయలేదు. ఇప్పుడు కేబినెట్ భేటీకి కూడా రాకపోతే రకరకాల ప్రచారాలు జరుగుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా జనసేన సోషల్ మీడియా స్పందించింది. పవన్ కల్యాణ్ అనారోగ్యం గురించి తెలిపింది. పవన్ కు చాలా కాలం నుంచి స్పాండిలైటిస్ సమస్య ఉంది. అది కూడా తిరగబెట్టింది. ఈ క్రమంలో విశ్రాంతిని వైద్యులు సూచించారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తీరిక లేకుండా ఉన్నారు. రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సింగపూర్ లో చదువుకుంటున్న పిల్లల వద్దకు ఆయనకొద్ది రోజుల పాటు వెళ్లారు. ఈ కారణంగానే ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయారు. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఆయన కేరళలోని ఆలయాల సందర్శనకు వెళ్లాలనుకున్నారు. కానీ జ్వరం కారణంగా వాయిదా పడింది.
పవన్ కల్యాణ్ వచ్చిన నేపధ్యం వేరు. సినీ హీరోగా ఆయన రాజభోగాలను అనుభవించేవారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన పార్టీ కోసం తిరిగడం మినహా మిగిలిన సందర్భంగా శారీరకంగా ఎక్కువగా ఒత్తిడికి గురి కాలేదు. కానీ ఇపుడు మాత్రం అటు ఫీల్డ్ వర్క్.. ఇటు రివ్యూలతో తీరిక లేకుండా ఉండాల్సి వస్తోంది. ఆ ఒత్తిడికి పవన్ శరీరం అలవాటు పడాల్సి ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.