జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో సారి అమరావతిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే ముందు.. రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామానికి వెళ్లి .. ప్రభుత్వంపై తిరగబాటు చేయాలని అక్కడి రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం కాల్పులు జరిపితే…. తాను ముందుగా గుండె చూపుతానంటూ ఆవేశపడ్డారు. ఆ తర్వాత భీమవరం వెళ్లిపోయారు. అక్కడ పోరాట యాత్ర ప్రారంభించక ముందే కాలు బెణకడంతో విశ్రాంతి తీసుకున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కాలు కుదుటపడి.. ఈరోజు పోరాటయాత్ర చేశారు. ఒక్క రోజుకే పోరాటయాత్రకు విరామం ఇచ్చి తన షెడ్యూల్ మార్చుకున్నారు. అకస్మాత్తుగా మరోసారి రాజధాని గ్రామాలకు పయనమవుతున్నారు.
ఉద్దండరాయుని పాలెంలోని ఎస్సీ రైతులకు న్యాయం చేయాలని శనివారం దీక్ష చేయనున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రాజధానిలోని లంక, అసైన్డ్ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ జనసేనాని ఈ దీక్ష చేయబోతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాజధానిలోని తుళ్లూరు మండలం, ఉద్దండరాయుని పాలెం గ్రామాలు సీడ్ క్యాపిటల్ పరిధిలో ఉన్నాయి. ఉద్దండరాయుని పాలెంలో ఎస్సీ రైతులకు అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆ గ్రామానికి వెళ్లివచ్చారు. తాజాగా ఆ రైతుల కోసం శనివారం దీక్ష చేయాలని నిర్ణయించారు. ఉద్దండరాయనిపాలెంలో 95శాతం మంది రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. లంక, అసైన్డ్ భూములు ఉన్న రైతులు తమకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఆర్డీఏ మాత్రం రాజధానిలో పట్టా భూములు, లంక, అసైన్డ్ భూములకు వేరువేరుగా ప్యాకేజీలను ప్రకటించింది. అన్ని గ్రామాల్లో అదే విధంగా పరిహారాన్ని అందిస్తోంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఉద్దండరాయుని పాలెం అసైన్డ్ భూముల రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని దీక్షకు సిద్ధమయ్యారు.
పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పోరాటయాత్రకు వెళ్లి …మళ్లీ వెనక్కి వచ్చి ..అమరావతి భూములపై ఎందుకు పోరాటం చేస్తున్నారన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్షలను పవన్ టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. శనివారమే ఒంగోలులో టీడీపీ ధర్మ పోరాట దీక్ష చేస్తోంది. అదే రోజు.. అనూహ్యంగా పవన్ అమరావతి భూములపై పోరాటం చేస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు పుట్టిన రోజున ధర్మపోరాట దీక్ష చేశారు. అదే రోజు పవన్ కళ్యాణ్ ఫిల్మ్ చాంబర్ వేదికగా హైడ్రామా నడిపారు. ఆ తర్వాత విశాఖపట్నం, తిరుపతి దీక్షల సమయంలో కూడా ఆయన ట్విట్టర్లోనూ, బయట కూడా తెలుగుదేశం పార్టీపై పై విమర్శల వర్షం కురిపించారు. చాలా సార్లు ధర్మ పోరాట దీక్షలతో ఏమొస్తుందని కూడా ప్రశ్నించారు. అందుకే టీడీపీ నేతలు బీజేపీతో కుమ్మక్కయి.. పవన్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.