జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో జనంలోకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు ఆయన బయలుదేరబోతున్నారు. దీని కోసం జనసేన ప్రత్యేకంగా ఒక బస్సును కొనుగోలు చేసింది. ప్రస్తుతం దాని రీ మోడలింగ్ జరుగుతున్నట్టు సమాచారం. అత్యాధునిక సదుపాయాలు ఈ బస్సులో ఉండబోతున్నాయి. బస్సులో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఒక రూమ్ ఏర్పాటు ఉంటుందని అంటున్నారు. ఒక విశ్రాంతి గది, ల్యాప్ టాప్ సౌకర్యం, బస్సులోంచి టాప్ మీదకు వెళ్లి ప్రసంగించేందుకు అనువుగా నిచ్చెన వంటి సౌకర్యాలు కూడా ఉంటాయట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో విదేశీ టూర్ లో ఉన్నారని సమాచారం.
యాత్రకు బస్సు సిద్ధమౌతోంది, బాగానే ఉంది! కానీ, ఈ యాత్రకు పవన్ ఎలా సిద్ధమౌతున్నారు అనేదే అసలు పాయింట్. ఎందుకంటే, గతంలో పవన్ కల్యాణ్ సభలు నిర్వహించిన సభలూ పర్యటనలు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. గత కార్యక్రమాలన్నీ కేవలం సమస్యల అజెండా మీదే జరిగాయి. కానీ, ఇప్పుడు జనసేన రాజకీయ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. 175 స్థానాల్లో పోటీకి జనసేన సిద్ధమని ప్రకటించేశారు. కాబట్టి, జనసేన విధివిధానాలేంటనేది ఈ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ మధ్య చాలా విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా అవినీతి ఆరోపణలు చేశారు. వాటికి కొనసాగింపుగా బస్సుయాత్రలో పవన్ మాట్లాడాల్సి ఉంటుంది కదా! పవన్ చేసే ఆరోపణలకు ఆధారాలుండవనే అభిప్రాయం ఇప్పటికే ఉంది. కాబట్టి, బస్సుయాత్రలో ప్రభుత్వాలపై చేసే ఆరోపణలకు ఏవైనా ఆధారాలు చూపే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.
ఇక, ఈ యాత్రలో పవన్ ఎదుర్కోబోతున్న సవాల్ కూడా ఒకటుంది. ఇటీవల ఆయన మీడియాలోని ఒక వర్గంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతమంది పత్రికాధిపతులు లక్ష్యంగా చేసుకుని, అదే పనిగా కొన్ని రోజులపాటు ట్వీట్లు పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ ట్వీట్లకు, పవన్ కి సంబంధించిన వార్తా కథనాలకు ప్రధాన మీడియా వర్గాలు ప్రాధాన్యత తగ్గించాయనే చెప్పాలి. దీంతో బస్సుయాత్ర నేపథ్యంలో మీడియా వ్యవహార శైలి ఎలా ఉండబోతోందనేది కూడా ప్రస్తుతం చర్చనీయమే అవుతుంది. సో.. ఈ యాత్రకు బయలుదేరేముందు పవన్ చాలా కసరత్తు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి, రాజకీయంగా ఏపీలో అత్యంత కీలకం కాబోతుందన్న అంచనాలున్న బస్సు యాత్రకు పవన్ ఎలా రెడీ అయి వెళ్లబోతున్నారో వేచి చూడాలి.