ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అటు సినిమా.. ఇటు పొలిటికల్ రెండింటిని ఒకేసారి సమన్వయం చేస్తున్నాడు. పవర్ స్టార్ గా ఫుల్ బిజీగా ఉండడంతో.. జనసేన పార్టీ అధినేతకి ఖాళీ ఉండడం లేదు. అయితే ఈసారి రెండింటిని కలిపి ఒకేసారి హ్యాండిల్ చేయబోతున్నాడు.
సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఈనెల 4 నుంచి హైదరాబాద్ లో జరగబోతోంది. నెలాఖరు వరకు ఇక్కడే జరుగుతుంది. ఇదే టైమ్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. గ్రేటర్ లో ప్రత్యక్షంగా బరిలో దిగకపోయినా.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతివ్వడానికి పవన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మాట.. ఇప్పటికే ఆ రెండు పార్టీల నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. జనసేన మద్దతు ఈ రెండు పార్టీల కూటమికి ఉండబోతోంది.
మొన్నటి వరకు గబ్బర్ షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది. ఇప్పుడు పవన్ భాగ్యనగరంలోనే అందుబాటులో ఉండడంతో.. రాజకీయ పరంగా ఏమైనా చర్చించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏ టైమ్ లో అయినా.. అందుబాటులో ఉండొచ్చు. సడన్ గా అవసరం పడితే ఒక రోజు షూటింగ్ రద్దు చేసుకుని గ్రేటర్ లో ప్రచారం చేయొచ్చు. సో.. ఇవన్నీ చూస్తే.. సర్దార్ కి స్వామి కార్యం, స్వకార్యం అన్నీ కలిసొచ్చినట్టు కనిపిస్తోంది.