తూర్పుగోదావరి జిల్లాలో దివిస్ ఫార్మా కంపెనీకి జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో దాని ప్రభావిత ప్రాంతాలు అయిన దానవాయిపేట, కొత్తపాకాల పరిసర ప్రాంతాల ప్రజలు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆందోళన చేస్తూ ఉండడం, దాదాపు వందకు పైగా ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం తెలిసిందే. అయితే ఈ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, ఆందోళన చేస్తున్న ప్రజలతో చర్చించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళితే…
జనవరి 9వ తేదీన దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని ఆ పార్టీ మీడియా హెడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇదే కంపెనీకి అనుమతులు ఇచ్చిన సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫార్మా కంపెనీ తో కుమ్మక్కయి ఒక పెద్ద డీల్ చేసుకుని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. 2016 లో ఇదే సమస్యపై ఇదే ప్రాంతాలలో పర్యటించిన జగన్ తాము అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కట్ చేస్తే, ఇప్పుడు మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. అప్పుడు ఆందోళనకారులపై చంద్రబాబునాయుడు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పిన జగన్ హయాంలో ఇప్పుడు వందకు పైగా కేసులు ఆందోళనకారులపై నమోదు అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, అటు టిడిపి ఇటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలు రెండూ తమను మోసం చేశాయి అన్న భావనలో ఈ ప్రాంత ప్రజలు ఉన్న నేపథ్యంలో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరిని సందర్శిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మరి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏ మేరకు ప్రభావం చూపుతుంది అన్నది వేచి చూడాలి.