డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. శుక్రవారం ఆయన తిరుపతికి వెళ్తారు. ముందుగా గోశాలను పరిశీలిస్తారు. తరవాత శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్తారు. ఇటీవల గోశాల అంశం రాజకీయంగా వివాదాస్పదమయింది. మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయని ఫేక్ ఫోటోలను భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేశారు. దీంతో దుమారం రేగింది. టీటీడీ కూడా తీవ్రంగా స్పందించింది. గతంలో గోశాల పట్ల ఎలా వ్యవహరించారో.. ఇప్పుడు ఎలా నిర్వహణ ఉందో ప్రజల ముందు పెట్టారు. భూమనపై మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేసు కూడా పెట్టారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ గోశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అలాగే శ్రీవారిని కూడా శనివారం దర్శించుకోనున్నారు. ఇటీవల తన కుమారుడు సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి బయట పడటంతో మొక్కులు తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పవన్ సతీమణి అన్నా లెజ్ నోవా తిరుమలలో మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కు అనారోగ్యంగా ఉండటంతో ముందుగా ఆమె వెళ్లారు. పవన్ కేబినెట్ సమావేశానికి కూడా అనారోగ్య కారణంతో వచ్చి వెళ్లిపోయారు.
గోవులంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఫామ్ హౌస్లో చాలా వరకూ గోవుల్ని పోషిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గోశాలపై వచ్చిన ఆరోపణల్ని స్వయంగా పరిశీలించాలని అనుకుంటున్నారు. వైసీపీ నేతలు మత విద్వేషాలు పెట్టాలనుకుంటున్న తీరుపై ఆయన విరుచుకుపడే అవకాశం ఉంది.