రాజధాని కోసం రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో తను ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాలలో పర్యటించి రైతులను కలుసుకొంటానని రెండు రోజుల క్రితమే ట్వీట్ చేసారు. చెప్పినట్లే ఆ రెండు గ్రామాలలో రేపు ఆయన పర్యటించబోతున్నారు. ఉదయం 10.30 గంటలకి ప్రకాశం బ్యారేజీ మీదుగా ఉండవల్లి గ్రామానికి చేరుకొని అక్కడ స్థానిక పాఠశాలలో రైతులతో మాట్లాడుతారు. ఆ తరువాత పెనుమాక అక్కడి నుండి బేతపూడి గ్రామాలలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం చేప్పట్టనున్న భూసేకరణపై అక్కడి రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుసుకొంటారు. రాజధాని గ్రామాలలో పర్యటించే ముందు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుసుకొంటారని వార్తలు వినిపించినా దానిని ఆయన సన్నిహితులు ఇంతవరకు ఖరారు చేయలేదు కనుక ఆయన ముఖ్యమంత్రిని కలవకుండానే రాజధాని గ్రామాలలో పర్యటించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన పర్యటనకు ఆయన అభిమానులే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ మెసేజ్ పోస్ట్ చేసారు. “రాజకీయ పార్టీలు జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నంత కాలం వాటి పట్ల విదేయంగా ఉండవచ్చును. కానీ వాటి సిద్దాంతాలు, పనితీరు వలన జాతి ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నప్పుడు కూడా వాటిని సమర్ధించడం నేరమే అవుతుంది. రాజకీయాలకు దేశ ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి,” అని మెసేజ్ పెట్టారు.
పవన్ కళ్యాణ్ నేరుగా తెదేపాను తప్పు పట్టకపోయినప్పటికీ ఆయన ఉద్దేశ్యం మాత్రం అదేనని ఈ మెసేజ్ ద్వారా అర్ధమవుతోంది.
ఆయన ఈరోజు పోస్ట్ చేసిన మెసేజిని తెదేపాకు అన్వయించి చూసిన్నట్లయితే, ఆ పార్టీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతున్నంత కాలం దానిని మద్దతు ఇచ్చానని, కానీ రైతుల నుండి వారి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటున్నప్పుడు కూడా దానికి మద్దతు తెలపడం తప్పని భావిస్తున్నట్లుంది. తెదేపా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడటం లేదు కనుక, దానికి తన మద్దతు ఉండదని చెపుతున్నట్లుంది పవన్ కళ్యాణ్. కానీ రేపు కూడా ఇదివరకులాగే రెండు మూడు గ్రామాలలో హడావుడిగా తిరిగేసి ఆ తరువాత మళ్ళీ రెండు మూడు నెలలు ప్రజలకు కనబడకుండా మాయం అయిపోతే ఇప్పుడు చెపుతున్న ఈ మాటలకు అర్ధం ఉండదు. ఒకవేళ ఆయన రైతులకు అన్యాయం జరుగుతోందని బలంగా నమ్ముతున్నట్లయితే, ఆయన వారి తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దపడినప్పుడే ఈ మాటలు అర్ధవంతంగా ఉంటాయి. లేకుంటే ఆయన మళ్ళీ విమర్శలు మూటగట్టుకోక తప్పదు.