తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన జరుగుతున్న సంగతి తెలిసిందే. జై తెలంగాణ అంటున్నారు, తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు, జై తెలంగాణ అనే మాట వింటే ఒళ్లు పులకించిపోతుందన్నారు, కేసీఆర్ స్మార్ట్ సీఎం అన్నారు, తెలంగాణ పోరాట తత్వం తనకు దగ్గరగా ఉంటుందన్నారు! తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, కేసీఆర్ పై ఈ స్థాయిలో పొగడ్తలతో గతంలో ఎన్నడూ ప్రశంసలు కురిపించలేదు. నిజానికి తెలంగాణలో ఇంత విస్తృతంగా పవన్ పర్యటించిన గతమూ లేదనుకోండి! అయితే, తెలంగాణ పర్యటనపై ఆంధ్రాలో స్పందన ఏంటనేదే ఇప్పటి చర్చనీయాంశం. ఇంతకీ, తెలంగాణ పర్యటనలో పవన్ చేస్తున్న వ్యాఖ్యల గురించి ఆంధ్రాలో సగటు అభిమాని ఏమనుకుంటున్నాడు..? ఈ పరిణామాలను ఎలా చూస్తున్నాడు..? ఎలా అర్థం చేసుకుంటున్నాడు..? తెలంగాణలోపవన్ చేస్తున్న ప్రసంగాలకు ఎలా స్పందిస్తున్నాడు..?
పవన్ తెలంగాణ పర్యటనపై ఏపీలో అధికార పార్టీ నుంచి పెద్దగా స్పందనలు కనిపించడం లేదు. ఆంధ్రాలో టీడీపీకి ప్రత్యామ్నాయం లేదు, మరొకరితో అవసరం లేదంటూ మంత్రి అచ్చన్నాయుడు అన్నారే తప్ప… మరే ఇతర వ్యాఖ్యలూ ఘాటుగా వినిపించడం లేదు. ఆంధ్రాలో రాజకీయంగా పవన్ వైఖరి ఏంటనేది సగటు అభిమానికి చాలా స్పష్టత ఉందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ చెబుతున్నా… అటూఇటూ తిరిగి, చివరికి తెలుగుదేశం పార్టీకే జనసేనాని మద్దతు ఉంటుందనే ఒక స్థాయి స్థిరమైన అభిప్రాయం అభిమానుల్లో చాలామందికి ఉందనేది వాస్తవం. మొదట్నుంచీ టీడీపీతో జనసేనకు ఉన్న సంబంధాల నేపథ్యం రీత్యా పవన్ వైఖరి ఇలానే ఉండొచ్చనేది వారి బలమైన అంచనా.
అయితే, తెరాస విషయంలో కూడా టీడీపీతో మాదిరిగా అనుసరిస్తున్న అత్యంత అనుకూల వైఖరిని పవన్ ప్రదర్శిస్తుండటం.. సగటు అభిమానికి కొంత నలత అనిపించే అంశంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే, కేసీఆర్ కుటుంబమంతా ఓ దశలో పవన్ కల్యాణ్ పై ఒంటికాలుపై లేచినవారే. ఆంధ్రాలో జనసేన ప్రభావం ఏమీ ఉండదంటూ ఆ మధ్య ఓ సర్వే గురించి సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక పవన్ వెర్సెస్ కేసీఆర్ విమర్శలు అనేవి ఎప్పట్నుంచో ఉన్నవే. రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ‘ఇకపై రెచ్చగొట్టే రాజకీయాలు చెయ్యొద్దంటూ’ పవన్ సూచించిన సందర్భాలున్నాయి. ఈ గతమంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవడమంటే… పవన్ ను అంత తీవ్రంగా కేసీఆర్, కేసీఆర్ పై అంతే తీవ్రంగా పవన్ విమర్శలు చేసుకునే సందర్భంలో అభిమానులు కూడా ఒక స్టాండ్ తీసుకుంటారు కదా! కొంత ఉద్వేగానికి లోనౌతారు కదా! తమ స్టార్ హీరో అభిప్రాయాలతో ఏకీభవిస్తూ కొన్ని స్థిరమైన ఆలోచనలు ఏర్పరచుకుంటారు కదా. నిన్నమొన్నటి వరకూ ఆ రకమైన మైండ్ సెట్ తోనే ఉంటూ వస్తున్న సగటు అభిమానికి.. పవన్ తాజా పర్యటనా, ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కొంత కొత్తగానే కనిపిస్తున్నాయి.
పవన్ వస్తారూ, రాజకీయాల్లో ఏదో కొత్త దనం తెస్తారూ.. ఇలాంటి కొన్ని ఆశలు కొంతమందిలో ఉన్నాయి. కానీ, ఇప్పుడు పవన్ వైఖరి కూడా ఒక ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరిగానే మారిపోతోందా అనే సందిగ్ధం సగటు అభిమానికి కలుగుతోంది. ఏ గుమ్మం ముందు నిలబడితే ఆ పాట పాడుతా అన్నట్టుగా.. తెలంగాణకు వెళ్లగానే తెరాసకు అత్యంత అనుకూలమైన నాయకుడిగా పవన్ తన వైఖరిని ప్రదర్శిస్తుండటం ఆంధ్రాలో కొంత చర్చనీయం అవుతోంది. అంటే, కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నంత మాత్రాన ఆంధ్రాలో పవన్ అంటే అభిమానం తగ్గిపోతుందని విశ్లేషించడం ఇక్కడి ఉద్దేశం కాదు. లేదా, కేసీఆర్ ను పవన్ కచ్చితంగా విమర్శించి తీరాలీ విభేదించి కూర్చోవాలనే ఉద్బోధ చేయడమూ లేదు. లేదా, ఆంధ్రాకు మాత్రమే పవన్ అనుకూలంగా ఉండాలనే సూత్రీకరణ కూడా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. గతంలో ఎక్కడా ఎలాంటి సానుకూలత ధోరణి ప్రదర్శించని పవన్, ఉన్నపళంగా తెరాసపై కేసీఆర్ పై ఈ స్థాయిలో ప్రేమను ఒలకబోస్తుండటం… సగటు అభిమానికి ఎక్కడో కొంత కలుక్కుమనే అంశంగా మారింది అనేది చెప్పడమే.