పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాల వైపు తిరిగి వెళ్ళిపోకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇటీవలే ఎన్నికలు అయిపోయి అందులో ఓటమి చెందారు కాబట్టి రోడ్ షో కి స్పందన వస్తుందో లేదో అని భావించిన జనసేన నాయకులకు స్వీట్ షాక్ ఇచ్చేలా జనసేన కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. టూర్ లో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. వివరాల్లోకి వెళితే..
కార్యకర్తలకు దిశానిర్దేశం:
భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ రోడ్ షో కి సభకు హాజరైన కార్యకర్తలలో ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో విఫలమయ్యామని డిప్రెషన్ కనిపించకపోగా నూతన ఉత్తేజం కనిపించింది. గోదావరి వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని, పోలవరం ముంపు ప్రాంతం బాధితులతో కలిసి చర్చించాలని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు సూచించారు. భీమవరం ప్రాంత ప్రజలు తనను ఓడినప్పటికీ, తాను భీమవరం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా భీమవరంలో డంప్ యార్డ్ సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
టిఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు:
అయితే ఈ పర్యటన సందర్భంగా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉదయం రాజమండ్రి కి రాగానే తనకు హైదరాబాద్ పోలీసుల నుండి ఫోన్ వచ్చిందని, టిఆర్ఎస్ కార్యకర్తలు గా భావిస్తున్న కొంతమంది తను లేని సమయంలో తన ఇంటిపై దాడికి ప్రయత్నిస్తున్నారని వారి ద్వారా తనకు తెలిసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను గతంలో మద్యపానం నిషేధం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు వారు పాల్పడుతున్నారని, గిరిజనుల వంటి కొన్ని తెగలలో మద్యం సేవించడం అనేది ఒక సంస్కృతిలో భాగం అని, ప్రజలలో చైతన్యం తీసుకు రాకుండా మద్యపానం నిషేధించడం అనేది సమాజంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తాను హెచ్చరించానని, అయితే దీనిని నెగిటివ్ గా తీసుకుని టిఆర్ఎస్ కార్యకర్తలు గా భావిస్తున్న కొందరు తన ఇంటిపై దాడికి తెగబడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, అలాగే అవసరమైతే గవర్నర్ నరసింహన్ దృష్టికి కూడా ఈ దుశ్చర్యను తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో ఇటువంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే వ్యక్తి తాను కాదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
జనసేన పార్టీని బతికించుకుంటా:
పవన్ కళ్యాణ్ ఓటమికి చెందితే జనసేన పార్టీ ఉండదని భావించిన వారికి షాక్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్, “ఓడించ బడ్డ ఈ భీమవరం గడ్డ నుండి చెబుతున్నా, మీ లోంచి నలుగురు వచ్చి నా దేహాన్ని మోసుకెళ్లే వరకు జనసేన పార్టీ బతికించుకుంటా” అంటూ భావోద్వేగంగా ప్రసంగించగా సభికుల నుండి హర్షధ్వానాలు పోటెత్తాయి. రాజకీయాల్లోకి రావడం మాత్రమే తనకు పరమావధి కాదని, అలా ఉంటే ప్రజారాజ్యం సమయంలోనే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగానే పోటీ చేసి ఉండేవాడినని, 2014లో తెలుగుదేశం పార్టీకి ఏ ప్రతిఫలం ఆశించకుండా మద్దతిచ్చే బదులు నాకు ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి నాకు మంత్రి పదవి కావాలి కానీ అడిగే ఉండేవాడినని, కానీ తనది అటువంటి వ్యక్తిత్వం కాదని, ఏ ప్రతిఫలం ఆశించకుండా తాను 2014 లో టిడిపి బిజెపి కూటమికి మద్దతు ఇవ్వడం వల్లే మోడీ సైతం మీలో ఒక దేశభక్తుడు కనిపిస్తున్నాడని తనతో వ్యాఖ్యానించారని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ భీమవరం కార్యక్రమం, విజయవంతంగా కొనసాగుతూ జనసేన పార్టీ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది.