పవన్ కల్యాణ్… చిరంజీవి.. ఇద్దరూ మెగా సోదరులు. రాజకీయంగా ఈ ఇద్దరూ ఇద్దరే! సైద్ధాంతికంగా ఇద్దరివీ రెండు భిన్న ధ్రువాలు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా చాలాసార్లు.. చాలా వేదికలపై చెప్పిన సందర్భాలున్నాయి. కొన్ని అంశాల్లో తన అన్నయ్యతో విభేదించాల్సి వచ్చిందనీ, అన్నింటినీ వదులుకుని తాను జనసేన పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చేశారు. రాజకీయాల్లో పవన్ యాక్టివ్ అవుతున్నారు.అయితే, ఈ ఇద్దరి మధ్యా సైద్ధాంతికంగా ఏవో విభేదాలు ఉన్నాయీ.. అనే ఒక ఇమేజ్ చట్రం నుంచి చాలామంది వీరిని చూస్తుంటారు. ఆ కోణం నుంచే ప్రతీదీ చూస్తూ విశ్లేషించుకుంటూ ఉంటారన్నది వాస్తవం. అయితే, ఆ అభిప్రాయాన్ని మార్చేందుకు తాజాగా పవన్ ప్రయత్నిస్తున్నట్టున్నారు! తన నడవడికలో ఆ తరహా సంకేతాలు పవన్ ఇస్తున్నారని అనిపిస్తోంది.
రాజకీయంగా ఎవరి దారి వారిదే అయినా.. అన్నయ్య చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానమో అనేది చాలాసార్లు పవన్ చాటి చెప్పుకున్నారు. అయినాసరే, మొదట్నుంచీ చిరంజీవి అంటే పవన్ గిట్టదు అనే ప్రొజెక్షన్ ఒకటుంది! దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని జనసేనకు దగ్గరయ్యేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నించొచ్చు అనే వాదన ఒకటి జనసేనాని వరకూ చేరి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు! అలాంటి సంకేతాలేవీ ఇకపై తన నుంచి వ్యక్తీకరణ కాకూడదని పవన్ నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు! అన్నదమ్ములిద్దరం ఎప్పుడూ ఒక్కటే అనే ప్రొజెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్టున్నారు!
తాజాగా ఓ ప్రముఖుడు పవన్ దగ్గరకు వచ్చారట. తాను పవన్ అభిమానని కాననీ.. మొదట్నుంచీ చిరంజీవిని అభిమానిస్తున్నానని నేరుగా పవన్‌తోనే చెప్పాడట. కానీ, జనసేన పెట్టిన తరువాత తమ ఐడియాలజీ నచ్చడంతోనే కలిసి పనిచేసేందుకు సిద్ధమై వచ్చానని ఆ వ్యక్తి అన్నాడట. వెంటనే అతడిని జనసేన టీమ్‌లో జాయిన్ చేసుకున్నారట! సో.. దీని ద్వారా పవన్ ఇస్తున్న సంకేతం ఏంటంటే.. చిరంజీవి అభిమానులను తాను వేరే దృష్టితో చూడటం లేదనీ, అన్నయ్యను అభిమానించేవారు తనకీ అభిమానులే అని! అన్నయ్యనూ తననూ రాజకీయంగా కూడా వేర్వేరుగా చూడొద్దనే సంకేతం ఈ ఘటన ద్వారా ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు.