తెలంగాణలో బీసీని సీఎంను చేస్తామని ప్రకటించి బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో బీజేపీ నిర్వహించిన సభకు ప్రధాని మోదీ పక్కన కూర్చునేలా గౌరవించి ప వన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు బీజేపీ నేతలు. పవన్ కల్యాణ్ కూడా పెద్దాయన పిలిచారు కాబట్టి గౌరవించాల్సిందేనని వెళ్లారు. ఆయనను పొగిడారు. మరోసారి ప్రధాని కావాలన్నారు. కానీ చాలా మంది కేసీఆర్ ను విమర్శించలేదని… ఆయన పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అలాంటి వారి బాధ ఒక్కటే… పవన్ ను ఏదో విధంగా విమర్శిద్దామని అనుకోవడమే.
పవన్ కల్యాణ్ కేసీఆర్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తే ఎవరికి లాభం ? . ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే లాభం. ఇప్పటికే జనసేన పార్టీ తెలంగాణద్రోహి పార్టీ అంటు హరీష్ రావుతో పాటు ఇతర నేతలు విమర్శలు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ కేసీఆర్ పాలనను విమర్శిస్తే… దాన్ని తెలంగాణ కోణంలో ప్రజలలోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉంటారు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాన్ని పెంచేందుకు కొత్తంగా విమర్శలు చేయాల్సిన పని లేదు. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్ని నమ్మించగలగాలి. పవన్ కల్యాణ్ అది చేయడానికే బీసీ సభలో ప్రాధాన్యం ఇచ్చారు. మోదీని చూసి ఓటేయాలన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. ప్రధాని మోదీ స్వయంగా ఓబీసీ.
పవన్ కల్యాణ్ గతంలోలా ఎక్కడ పడితే అక్కడ ఆవేశపడటం లేదు. ఎక్కడ ఆవేశపడాలో అక్కడే పడుతున్నారు. దానికి బీసీ సభ ఉదాహరణగా నిలిచింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో… అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన దశలో పవన్ తన బాధ్యతను పక్కాగా నిర్వర్తించారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్కు మేలు చేస్తున్నామన్న అభిప్రాయానికి రాకుండా… సంయమనంతో వ్యవహరించారు. కొంత మంది పవన్ …కేసీఆర్ ను విమర్శించారని.. బీఆర్ఎస్ను కడిగేయాలని ఆశించి … నిరాశపడిన వారు పవన్ పై బండలేయవచ్చు కానీ.. పవన్ మాత్రం… సరైన రాజకీయమే చేశారని కాస్త తెలంగాణ రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఎవరికైనా అర్థమవుతుంది.