సినిమాలలో నటించాలి అనుకునే నటులందరూ కూడా వాళ్ళ నటనా సామర్థ్యాన్ని సినిమా సినిమాకూ ఇంప్రూవ్ చేసుకుంటూ నటుడిగా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కమల్ హాసన్, అమీర్ ఖాన్, విక్రమ్లలా అన్నమాట. అలాగే కలెక్షన్స్ కొల్లగొట్టే కొంతమంది స్టార్ హీరోలు కూడా నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల లాగా. కానీ సినిమాలలో సూపర్ ఇమేజ్ తెచ్చుకుని పాలిటిక్స్‌లో కుమ్మేయాలి అనుకునేవాళ్ళు మాత్రం ‘స్క్రీన్ గాడ్’ నుంచి రియల్ గాడ్ అనిపించుకోవడం ఎలా అనే తరహా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు యాక్ట్ చేసే మేక్సిమం సినిమాల్లో కథంటూ ఏమీ ఉండదు. చెల్లెల్లను, మహిళలను కాపాడే ఓ అన్నయ్య కథ, అవినీతిని అంతమొందించే ఓ పోరాటయోధుడి కథ, క్రిమినల్స్ అంతం చూసే ఓ వీర పోలీసువాడి కథ, అభిమానుల చేత దేవుడు అనిపించుకోవడం కోసం ఒక దేవుడి క్యారెక్టర్ కథ. ఈ దేవుడు కూడా ఏ హీరో దేవుడి వేషం వేస్తే ఆ హీరోకి తగ్గట్టుగా మారిపోతాడు. అదేంటనే ప్రేక్షకుల ప్రశ్నకు ‘ట్రెండీ దేవుడు’ అని చెప్పి ఆ సినిమాలోనే సమాధానం చెప్పిస్తారు. చిరంజీవి, బాలకృష్ణలిద్దరూ ఈ తరహా వేషాలు వేసినవాళ్ళే. పవన్ కూడా తన మార్క్ యాక్టింగ్(?)తో ఈ హీరోల వేషాలన్నీ వేసేశాడు.
ఇప్పుడిక…మన తెలుగుకు మాత్రమే పరిమితమైన…..రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అంతం చేసి, సీమను సస్యశ్యామలం చేసే హీరో పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు వాళ్ళందరికంటే కూడా ఫ్యాక్షనిజాన్ని లైక్ చేసే జనాలు, కొంతమంది ఆవేశపరులైన ప్రేక్షకులు…బాలకృష్ణను వీరావేశంతో అభిమానిస్తూ ఉంటారు. బాలయ్య సినిమా రిలీజ్ అయిన టైంలో రాయలసీమలో మనకు ఆ తరహా జనాలకు ఎక్కువ మంది కనిపిస్తారు. అంతా కూడా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సీమ పౌరుషం పేరు చెప్పి చూపించిన నరుకుడు సినిమా ప్రభావం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. అలాగే ఇంద్రసేనారెడ్డి అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా సీమరక్తం పౌరుషం ఇలా ఉంటుందంటూ తన హీరోయిజం చూపించాడు. 2009 ఎన్నికల ప్రచారంలో కడపకు వెళ్ళి మరీ రియల్‌గా కూడా తొడగొట్టి, మీసం మెలేసి వచ్చాడు. దానికి తగ్గట్టుగానే చిరంజీవి, బాలయ్యలిద్దరినీ కూడా రాయలసీమ అభిమానులే ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అఫ్కోర్స్ ఎమ్మెల్యేలు అయ్యాక….చిరు, బాలయ్యలు రాయలసీమకు చేసింది ఏమీ లేదని…సీమను సస్యశ్యామలం చేయడం అనే ‘యాక్షన్’ అంతా సినిమాల్లో మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠంతో చెప్తున్నమాట. ఇప్పుడిక పవన్ కళ్యాణ్ వంతు వచ్చేసింది. సీమ పౌరుషానికి, కొంతమంది ఆవేశపరుల ఆవేశానికి పవన్ కళ్యాణ్ మార్క్ బ్రాండింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సీమ ఫ్యాక్షనిజాన్ని ఈయన ఎలా అంతం చేస్తాడో చూడాలి. మొదటి సినిమా నుంచీ కూడా మెడ రుద్దుకోవడాన్ని తన ట్రేడ్ మార్క్ స్టైల్‌గా అభిమానులకు చూపించిన పవన్…ఈ సారి మీసం మెలేయడం, తొడగొట్టడంలాంటి విషయాల్లో కూడా ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి? అలాగే 2019 ఎన్నికల్లో ఈ సీమ ఫ్యాక్షన్ హీరోయిజం రాయలసీమ జిల్లాల్లో పవన్‌కి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
సినిమా అంతా ఫ్యాక్షనిజాన్ని హైలైట్ చేసి, హింసను హీరోయిక్‌గా చూపించి…చివరలో మాత్రం శాంతి, అహింస అంటూ నాలుగు డైలాగులు చెప్పుకొచ్చే ఈ హీరోల స్టంట్స్‌ని నిజజీవితంలో ఎవ్వరూ కూడా చేసే ప్రయత్నం చేయవద్దని మనవి.
అలాగే రాయలసీమలో ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆదికేశవరెడ్డిలాంటి వాళ్ళు గట్టిగా ఓ వందమంది అయినా ఉన్నారో…లేదో చెప్పలేం. కానీ 99శాతం మంది మాత్రం మన అందరిలాగే మామూలుగా బ్రతుకుతున్న మామూలు మనుషులు….. ఇది ఓ జర్నలిస్టుగా నేను చూసిన రాయలసీమ నాకు చెప్పిన నిజం.