”హీరో అంటే మా అన్నయ్య తప్పా ఇంకెవరు లేరు నాకు. మా అన్నయ్యే నాకు ఆదర్శం. సినిమా కోసం ఒళ్ళు హూనం చేసుకొని ఇంటికి వచ్చినపుడు అన్నయ్య సాక్స్ లోని చమటలో కూడా ఒక సువాసన కనిపించేది. ఒక వ్యక్తి కష్టం తాలుక సువాసన అది” మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలివి.
నిజమే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక సినిమాకి ఎంత కష్టపడి పనిచేయాలో చిరంజీవిని చూసి నేర్చుకోవాలి. నాలుగు దశాబ్దాలుగా వెండితెర బాస్ గా వెలుగుతున్న మెగాస్టార్ కి.. ఊరకనే ఆ స్టార్ స్టేటస్ రాలేదు. రేయింబవళ్ళు సినిమా కోసం శ్రమించారు మెగాస్టార్.
తన కమ్ బ్యాక్ సినిమాలోనూ అదే శ్రమ, ఉత్సాహం చూపించారు. తన 150వ సినిమా కోసం దాదాపు రెండేళ్ళుపాటు కధలు విన్నారు. ‘ప్రేక్షకులను, నా అభిమానులను ఎలాంటి కధతో వినోదం పంచాలి’ అని అలోచించారు. చివరకి రిస్క్ చేయకుండా జన ఆమోదం పొందిన కధనే తీసుకొని.. తనకే సాధ్యమైన హీరోయిజంతో అలరించారు. ఎక్కడ కూడా లైట్ తీసుకోలేదు. మొదటి సినిమా చేస్తున్న హీరో కూడా అన్ని విభాగాల్లో కష్టపడతాడో లేదో కానీ మెగాస్టార్ మాత్రం ఎక్కడా అలసత్వం వహించలేదు. యాక్షన్ సీన్స్ లో చమటలు చిందించారు. అభిమానులు తన నుండి కోరుకునే డ్యాన్స్ లు, సిగ్నేచర్ స్టెప్స్ తో వూర్రుతలూగించారు. ఈ ఏజ్ లో కూడా చిరంజీవి అలా కష్టం పడటం చూస్తే అభిమాని కానివాడు కూడ తెగ ముచ్చట పడిపోయాడు. మెగాస్టార్ డెడికేషన్ అంతా తెరపై కనిపించింది. ఆయన పడిన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారు. మెగాస్టార్ కు గ్రాండ్ గా వెల్ కం బ్యాక్ చెప్పారు.
కానీ అన్నయ్యే తనకు ఆదర్శం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ మాటేమిటి? కేవలం మాటలకే పరిమితయ్యాడనిపిస్తుంది ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుంటే. అవును.. ఎవరేమనుకున్నా ఇది అంగీకరించాల్సిన విషయం. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ సరైనా హిట్ లేదు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఫ్లాపులు. ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ పవన్ కళ్యాణ్ లో మాత్రం ఆ సెన్స్ కనిపించలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ కంటే ఘోరంగా తయారైయింది అజ్ఞాతవాసి. ఈ సినిమా ప్రతి ఫ్రేం లో పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం కనిపించింది. ఈ సినిమా కధను ఫోన్ లో రెండు నిమిషాలు విని ఓకే చేశారట పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యమో అని. అసలు ఫోన్ లో ఒక నిమిషం కధ చెప్తే ఒప్పుకోవడం ఏమిటని పవన్ కళ్యాణ్ అభిమానులే ప్రశ్నిస్తున్నారిప్పుడు. తన కెరీర్ లో 25వ సినిమాగా వస్తున్న కధకు పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా ? అంటున్నారు.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన కౌశలం గురించి చెప్పుకోవాలి. అడుగడుగుణ నిర్లక్ష్యం కనిపించింది. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన అభిమానులను అలరిద్దాం అనే ఆలోచనే లేకుండా పోయింది. సినిమా మొత్తం డిస్ కనెక్ట్ గా కనిపించి, క్లూ లెస్ గా వుండి అభిమానులు తలలు పట్టుకొనేలా చేసిన క్రెడిట్ అజ్ఞాతవాసికి దక్కుతుంది. పవన్ కళ్యాణ్ ఫైట్లు చేస్తే చూసి మురిసిపోవాలనుకొనే ఫ్యాన్స్ ఒక్క అడుగు కూడా కదలని పవన్ కళ్యాణ్ ని చూసి.. డంగైపోయారు. తన ఎనర్జీ తో బాక్స్ ఫీసును షేక్ చేస్తాడనుకున్న అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ”నేను కదలను నా రెండు చేతులు మాత్రమే కదులుతాయి” అని శపథం పెట్టుకున్నట్లు సినిమాలో ఫైట్లన్నీ అలా రెండు చేతులను చూపించి అభిమానులకు మొండి చేయి చూపించాడు పవర్ స్టార్. ఎదో ఒక ఫైటు అంటే వెరైటీ అని సరిపెట్టుకుంటారు. కానీ ప్రతి ఫైట్ లో కేవలం ఆ రెండు చేతులు చూపించడం అంటే బద్దకం కాకపొతే మరేంటి.
ఇంక డ్యాన్స్ లు. పవన్ కళ్యాణ్ గొప్ప డ్యాన్సర్ ఏమీ కాదు. కానీ గ్రేట్ గ్రేస్ వున్న డ్యాన్సర్. ఆలా పవన్ కళ్యాణ్ కదిలితే చాలు.. చిన్న చిన్న సిగ్నేచర్ స్టెప్పులతో అభిమానుల మతి పోగొట్టే రిథమ్ ఆయన సొంతం. కానీ అజ్ఞాతవాసిలో ఆ మెరుపులే కరువయ్యాయి. వెరసి.. పవన్ కళ్యాణ్ అభిమానుల మనసుల్లో తీవ్ర నిరాశ. ఇదే కాదు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లో కూడా పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం కనిపించింది. బాగా గమనిస్తే.. అత్తారింటి దారేది తర్వాత .. చేసిన సినిమాల్లో కొన్ని పాటలకు పవన్ కళ్యాణ్ లిప్ సింక్ కూడా ఇవ్వడం లేదు. కావాలంటే ప్రస్తుతం థియేటర్ లో వున్న అజ్ఞాతవాసిని గమనిస్తే తెలుస్తుంది.
సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు.. ఇప్పుడు అజ్ఞాతవాసి. ఇవి ఫ్లాఫ్ బాట పట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ లోని నిర్లక్ష్యమనే చెప్పకతప్పుదు. సినిమా కంటే మనం పెద్ద అనే ఫీలింగ్ తో మాత్రం ఈ నిర్లక్ష్యం వచ్చుంటే మాత్రం.. ఇది అంత మంచిది కాదు. చిరంజీవి తర్వాత అంత పాపులారిటీ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి ఎలా అయితే ఇండస్ట్రీ మొత్తం తనవైపుకు పోలరైజ్ అయ్యే స్టామినా సంపాదించుకున్నారో పవన్ కళ్యాణ్ కూడా అంతటి క్రేజు చరిష్మా స్టార్ డమ్ సాధించుకున్నాడు. ఇప్పడు మెగాస్టార్ కంటే ఎక్కువ రెట్లు అభిమానులు పవన్ కు వున్నారు. ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి.
కానీ ఈజ్ లో కుడా చిరంజీవి చూపిస్తున్న డెడికేషన్ లో పది శాతం కూడా గత కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ లో కనిపించడం లేదు. అన్నయ తనకు ఆదర్శం అని చెప్తున్న పవన్ కళ్యాణ్.. సినిమాని సీరియస్ గా తీసుకోవడంలో, డెడికేషన్ లోనూ మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకుంటే బావుటుంది.