సినీ నటుడు పవన్ కల్యాణ్ కు షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికినట్టుంది. హటాత్తుగా ఏపీ ప్రత్యేక హోదా గురించి కామెంట్లను ట్వీట్ చేయాలని గుర్తుకు వచ్చినట్టుంది. అంతే, తనదైన శైలిలో ట్వీట్ చేసేశారు. ట్విటర్లో పోస్ట్ చేసేసి తన పనై పోయిందనుకుని, మళ్లీ ఆయన షూటింగ్ లో బిజీ అయ్యారేమో.
ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన ట్వీట్ చేశారంటే … మాట తప్పిన వాళ్లను చీల్చి చెండాడే రేంజిలో రియాక్షన్ ఉంటుందేమో, ఆమరణ దీక్ష లాంటిది ప్రకటించారేమో అని చాలా మంది అనుకున్నారు. ఆత్రంగా ట్వీట్ ను చదివారు. ఆనాడు పార్లమెంటులో కాంగ్రెస్ తప్పు చేసిందని పాత విషయాన్ని కొత్త ట్వీటులో చెప్పారు. బీజేపీ కూడా తప్పు చేయవద్దని తాను కోరుకుంటున్నానన్నారు.
ప్రత్యేక హోదా కోసం జనం రోడ్లమీదికి రాకముందు అధికార పార్టీ ఉద్యమాన్ని మొదలుపెట్టాలట. ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోవాలట. అంటే పవన్ కల్యాణ్ మాత్రం షూటింగులో బిజీగా ఉంటారన్న మాటా?
పవన్ కల్యాణ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా సామాజిక స్పృహతో ఆలోచించడం ఆయన ప్రత్యేకత. అయితే ఎందుకో ఆయన అయోమయంలో ఉన్నారేమో అనిపిస్తుంది.
ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని పదే పదే చెప్పడం, ఎప్పుడో ఓసారి నాలుగు మాటలు వదలడం తప్ప పవన్ చేసిందేమీ కనిపించడం లేదు. అధికార, ప్రతిపక్షాలు ఉద్యమంలో నిమగ్నమై ఉంటే ఆయన మాత్రం షూటింగు చేసుకుంటూ మధ్య మధ్య ట్వీట్లు చేస్తుంటారని జనం భావించాలా? ప్రశ్నించే జనసేన పద్ధతి ఇదేనా అని అడిగే వాళ్లకు ఇంత వరకూ జవాబు లభించ లేదు.
ఏపీకి ప్రత్యేక హోదాపై ఆనాడి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన మాట వాస్తవం. అసలు ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని వెంకయ్య నాయుడు పట్టుబట్టిన మ మాట వాస్తవం. పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆనాటి హామీని అమలు చేయకపోవడం వాస్తవం. పార్లమెంటులో ఎన్నిసార్లు ప్రస్తావించినా ఫలితం లేకపోవడం వాస్తవం. అసలు ఆ హామీని నెరవేర్చాల్సిన అవసరమే లేదు పొమ్మని కమలనాథులు మాట్లాడటం వాస్తవం.
ఇన్ని వాస్తవాలు కూడా పవన్ కల్యాణ్ కు కనిపించడం లేదంటే బహుశా షూటింగ్ లో బాగా బిజీగా ఉండి ఉంటారు. ఇక, ఆయన రంగంలోకి దిగి, ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా వచ్చేలా పోరాడేది ఎప్పుడో మరి. షూటింగ్ గ్యాపులో ట్వీట్లు చేయడం కాదు, హోదాను సాధించడం అంటే. అధికార పార్టీకి, ప్రతిపక్షాలు సలహాలివ్వడం సరే. జన సేనానిగా తానే చేస్తారో, ఇంత తీవ్రమైన పోరాటం చేస్తారో కూడా ప్రజలకు చెప్తే బాగుండేది. కేవలం ప్రశ్నించడం అంటే అదేదో పార్ట్ టైమ్ జాబ్ లా అప్పుడప్పుడూ ఆన్ లైన్ లో తళుక్కున మెరిస్తా సరిపోతుందా?