ట్వీట్ వీరుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీటేశారు. ఈసారి నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మీదకే నేరుగా ట్వీట్ బాణం వదిలారు. తన ట్వీట్ బాణంతో ముఖ్యమంత్రికి ఒక లక్షణరేఖ కూడా గీసారు. ఏవిధంగా అంటే, ‘గౌరవనీయులయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇందుమూలంగా విజ్ఞప్తి చేయునది ఏమనగా దయచేసి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దు. ముఖ్యంగా మంచి సారవంతమయిన భూములు గల ఉండవల్లి, పెనుమాక, బేతంపూడి మరియు నదీ పరివాహక గ్రామాలలో భూసేకరణ చట్టం ప్రయోగించి భూమిని సేకరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని వినయపూర్వకంగా ఆదేశించారు. అంతేకాదు దానికి మరికొంత హిస్టరీ కూడా జోడించారు.
అదెలాగంటే, “ అది ఏ దేశంమయినా కావచ్చు, దానిని ఎవరయినా పరిపాలిస్తుండవచ్చును…కానీ ఒక ప్రాంతం లేదా జాతి అభివృద్ధి కోసం పర్యావరణ నష్టం, ప్రజలు నిరాశ్రయులవడం, అందుకు వారు వ్యతిరేకత చూపడం నాగరికతలో సర్వసాధారణమయిన విషయమే. కానీ తక్కువ నష్టంతో అభివృద్ధి చేయడంలోనే పరిపాలకుల తెలివితేటలు ప్రదర్శితమవుతాయి,” అని వివరించారు.
కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన మంత్రులకీ ఈ విషయం బొత్తిగా అర్ధం అవుతున్నట్లు లేదు. అందుకే ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కి కాస్త గట్టిగానే జవాబిచ్చారు.
“రాజధాని నిర్మించబోయే ప్రాంతానికి సరిగ్గా మధ్యలో ఉన్న ప్రాంతాలను వదిలిపెట్టి రాజధానిని ఎలా నిర్మించవచ్చో పవన్ కళ్యాణ్ చెపితే బాగుంటుంది. ఆ ప్రాంతాలను విడిచి పెట్టి త్రిశ్నకు స్వర్గంలాగ రాజధానిని గాలిలో నిర్మించడానికి మేమేమీ విశ్వామిత్రులం కాము. సమస్యని ఎత్తి చూపే బదులు దానికి పరిష్కారం చూపితే బాగుంటుంది,” అని అన్నారు.