జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల పొత్తులకు సంబంధించి పెట్టిన ట్వీట్లపై రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నది కొంతమంది కావాలని చేస్తున్న దుష్ప్రచారాలపైనేనని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉదాహరణకు ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతిలో జనసేనకూ వైసీపీకి పొత్తు ఖాయమైనట్టే కథనం రాశారని వారు ఉదహరించారు. ఈ కథలు పటాపంచలు చేసేందుకే మాకు ఏ పెద్దపార్టీ అండ అక్కర్లేదని పవన్ వ్యాఖ్యానించారని ఒక ముఖ్య ప్రతినిది వివరణ ఇచ్చారు. ఈ ట్వీట్లు వామపక్షాలకు వర్తించేవి కావనడానికి రెండు కారణాలు చెప్పారు.
మొదటిది- పులి ,తోక వంటి నెగిటివ్ మాటలు పవన్ వామపక్షాలపై వుపయోగించే అవకాశం లేదు.మొదటి నుంచి ఆయనకు వామపక్షాల పట్ల సదభిప్రాయమే వుంది గనక ఇలాటి భాష వాడరు. కొంతమంది దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాలకు కోపం వచ్చి ఈ ట్వీట్టు చేశారు.
రెండు- మాకు పెద్ద పార్టీ అండ అవసరం లేదన్నప్పుడు వామపక్షాలకంటే మేమే పెద్ద పార్టీగా వుంటాము. అన్ని చోట్లా పోటీ చేస్తాము. కనక ఆ రీత్యా కూడా వారికి వర్తించదు.
అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ల వల్ల అనవరసర గందరగోళం ఏర్పడిందని మరో నాయకుడు అభిప్రాయపడ్డారు.ఈలోగాో జనసేన తెలంగాణలో టిఆర్ఎస్ను బలపరుస్తుందనే కథలు కూడా నిజం కాదనీ దాని ప్రభావం ఎపిపై పడుతుందని తమకు తెలుసనీ ఆయన అన్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందనేది వారి భావనగా వుంది.
గతంలో నాగబాబు, ఇటీవల రామ్చరణ్తాజాగా తల్లి అంజనా దేవి పవన్‌కు తోడుగా రావడం కుటుంబం ఆయనతో వుందనేందుకు నిదర్శనమని జనసేన నేతలు చెబుతున్నారు. చిరంజీవి రాజకీయ వేదికపై రాకున్నా సినిమా వేడుకల్లో చాలాసార్లు కనిపించిన సంగతి గుర్తుచేస్తున్నారు.