మాట కోసం ప్రాణాలయినా ఇచ్చేస్తాడు, ఎంత బలవంతుడితోనైనా తలపడేంత ధైర్యం ఉన్నవాడు, నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్, డబ్బులకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వని త్యాగి, కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి కన్నీరు కార్చే మానవతావాది……..ఇలా….ఇంకెన్నో పవన్‌కి ఆపాదించేశారు ఆయన భజన బృందం. కోట్లాది రూపాయలు తీసుకునే ఓ హీరో ఓ లక్ష రూపాయలు దానం చేయగానే ఇక భజన బ్యాచ్ పొగడ్తలు మామూలుగా ఉండవు. కంటికి కనిపిస్తున్నది ఆ లక్షే….గుప్తదానాలు కోట్లలో ఉంటాయి అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రచారం చేసేస్తూ ఉంటారు. కానీ సినిమా నటుడిగా పవన్ వ్యవహారం ఎలా ఉన్నా రాజకీయ నాయకుడిగా మాత్రం పవన్ చూపు ఎఫ్పుడూ ఆర్థికంగా, మీడియా పరంగా, అధికార పరంగా బలంగా ఉన్నవాళ్ళవైపే ఉంటోంది. అప్పుడెప్పుడో అన్నయ్య పార్టీలో ఉన్నప్పుడు పంచెలూడదూసి కొట్టండి అన్న ఒక్క ప్రసంగాన్ని మినహాయిస్తే ఆ తర్వాత అంతా కూడా పవన్ రాజకీయ వ్యవహారశైలి ఎప్పుడూ పేదల పక్షాన ఉన్నట్టుగా కనిపించదు.
రాజధాని నిర్మాణం కోసం భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు అన్నాడు. పోరాటం చేస్తానన్నాడు. ఇప్పుడు కూడా అమరావతిలో బెదిరింపుల పర్వం నడుస్తుందన్న విషయం పవన్‌కి తెలియదా? ప్రత్యేక హోదా విషయంలో ఓ మూడు సభలు….నాలుగు స్పీచ్‌లు అన్నట్టుగా హంగామా చేశాడు. ఇక ఆ తర్వాత ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపైన పోరాటం చేస్తే అధికారంలో ఉన్నవాళ్ళకు ఇబ్బంది అవుతుంది తానే అనుకున్నాడో, లేక వేరే ఎవరి సూచనలైనా ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఉత్తర-దక్షిణ భారతదేశం అంటూ పాలకులను ఏ మాత్రం ఇబ్బందపెట్టని ఓ సమస్యను ఎత్తుకున్నాడు. ఆ విషయంలో అయినా నిజంగా పవన్‌కి చిత్తశుద్ధి ఉందా అంటే అనుమానమే. ఎందుకుంటే టిటిడి ఈవోగా ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా మొదటి సారి ఓ ఉత్తరాది ఐఎఎస్‌ని నియమించాడు చంద్రబాబు. ఆ విషయంపైన అస్సలు మాట్లాడలేదు పవన్.
ఇక తాజాగా రైతుల సమస్యల గురించి పవన్ ఇచ్చిన ప్రకటన కూడా జగన్‌కి వచ్చే మైలేజ్‌లో వాటా కొట్టేద్దామన్న తాపత్రయం తప్పితే అస్సలు నిజాయితీ లేదు. 2014లో జగన్‌కి వ్యతిరేకంగా, చంద్రబాబుకు మద్ధతుగా పవన్ ప్రచారం చేసినప్పుడు పెద్దగా విమర్శలు రాలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే మంచిది అని ఎక్కువ మంది ప్రజలు భావించారు కనుక. కానీ మూడేళ్ళుగా చంద్రబాబు పాలన చూస్తున్న తటస్థులు ఎవ్వరూ కూడా పవన్‌ని సమర్థించే పరిస్థితి లేదు. అలాగే కాటమరాయుడు ప్రి రిలీజ్ ఫంక్షన్లో రవిప్రకాష్‌ని ప్రశంశించిన పవన్…..ఇప్పుడిక రాధాకృష్ణను ఓదార్చే పనిపెట్టుకున్నాడు. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినప్పుడు కూడా కనీసం స్పందించలేదు పవన్. అలాంటిది ఆంధ్రజ్యోతి ఆఫీస్‌లో అగ్రిప్రమాదం జరిగితే రాధాకృష్ణ ప్రాపకం కోరుకునే అందరు నాయకుల్లాగే పవన్ కూడా బయల్దేరడం చూస్తే విస్మయం కలుగుతోంది. చంద్రబాబు సావాస దోషం పుణ్యమాని పవన్ కూడా చంద్రబాబులాగే మీడియా మేనేజ్మెంట్ రాజకీయాలు చేద్దామనుకుంటున్నాడా? ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా సంస్థలలో ప్రజల పక్షాన ఉన్నవి ఎన్ని? అవినీతిపరులు, అక్రమార్కులు, అధికార పార్టీల పక్షాన ఉన్నవి ఎన్ని? అలాంటి వాళ్ళతోనూ, ఆర్థికంగా బలవంతులుగా ఉన్నవాళ్ళతోనూ ‘సంబంధాలు’ ఉన్నవాళ్ళు ప్రజల పక్షాన పోరాడగలరా? చేతికి రాకుండా పోయిన పంట విషయం పక్కన పెడితే…….చేతికొచ్చిన పంటకు కూడా ఫలితం రైతు ఇంటికి చేరకుండా బ్రోకర్స్ ఇంటికి ఎందుకు చేరుతోంది? మార్కెట్‌ని ఎవరు శాసిస్తున్నారు? ఆ శక్తులకు ప్రభుత్వ పెద్దలు మధ్ధతుగా నిలుస్తున్న మాట వాస్తవం కాదా? ఆ పాలకులకు మీడియా ఊడిగం చేస్తున్న మాట వాస్తవం కాదా? అలాంటి వాళ్ళతో ‘సంబంధం’ ఉన్న పవన్ లాంటి వాళ్ళు ప్రజల పక్షాన చిత్తశుద్ధితో పోరాడగలరా? చంద్రబాబు బాటలోనే నడుస్తున్న పవన్ వళ్ళ ప్రజలకు కొత్తగా ఒరిగేది ఏం ఉంటుంది?