ఎన్నికలకు ముందు కొండగట్టు అంజన్న ఆలయం నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్.. ఏపీలో కూటమి ఘన విజయం తర్వాత కొండగట్టు అంజన్నను దర్శించుకున్నాక నియోజకవర్గ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈమేరకు ఈ నెల 29న ఆయన కొండగట్టు పర్యటన ఫిక్స్ అయింది.
ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అందులో భాగంగా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన కొండగట్టుకు మొదటిసారి రాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్. తన ప్రచార రథం వారాహికి కొండగట్టులోనే పూజలు చేయించి అక్కడి నుంచి వారాహి విజయ యాత్రను మొదలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో పవన్ మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకుంటున్నారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం పవన్ పిఠాపురం వెళ్లనున్నారు. జులై 1 నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు పవన్.