పల్నాడులోని సరస్వతి పవర్ పరిశ్రమ భూముల వ్యవహారంలో పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకున్న ఆయన నేరుగా భూములను పరిశీలించారు. తర్వాత సంచలన ఆరోపణలు చేశారు. అసలు సిమెంట్ కంపెనీ పేరుతో అనుమతులు తీసుకోలేదని పవర్ పరిశ్రమ పేరుతో అనుమతి తీసుకున్నారని మండిపడ్డారు. ఆ భూముల్లో నాలుగు వందల ఎకరాలకుపైగా అటవీ భూములు ఉన్నాయని..ఇరవై నాలుగు ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయని పవన్ ప్రకటించారు.
సరస్వతి పవర్ పరిశ్రమలో ఉద్యోగాలిస్తామని చెప్పి రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారు. వారికి ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే లీజులు పెంచుకున్నారు. ఇప్పుడు తమ ఆస్తి అయినట్లుగా అన్నాచెల్లెళ్లు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఓ వ్యూహం ప్రకారమే సరస్వతి భూములను పరిశీలించారని..ఈ అంశంపై రేపోమాపో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్నఅభిప్రాయం వినిపిస్తోంది. అటవీభూముల్ని మళ్లీ రెవిన్యూపరిధి నుంచి తప్పించి అటవీభూమిగా ప్రకటించడం.. అసైన్డ్ ల్యాండ్స్ ను స్వాధీనం చేసుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి.
అలాగే రైతులకు ఇచ్చే పరిహారం విషయంలోనూ సరస్వతి పవర్ పరిశ్రమ యాజమాన్యం మోసం చేసిందని రైతులు అంటున్నారు. ఉద్యోగాలిస్తామన్న హామీని నెరవేర్చలేదు. పరిశ్రమ పెట్టే వరకూ రైతులకు వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు. ఈ దిశగా కేంద్రం న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.