అటు మహేష్ బాబు – ఇటు.. పవన్ కల్యాణ్.
ఇద్దరూ టాలీవుడ్ సూపర్ స్టార్లే.
ఇద్దరూ.. రికార్డు వీరులే.
అలాంటిది ఇద్దరి సినిమాలూ ఒకే సీజన్లో వస్తే..
నువ్వా? నేనా? అని పోటీ పడితే – బాక్సాఫీసుకి పండగే. ఓ సగటు సినీ అభిమానికి ఇంత కంటే కావల్సింది ఏముంటుంది? 2022 సంక్రాంతికి వీరిద్దరి సినిమాలూ వచ్చేస్తున్నాయ్. 2022 సంక్రాంతి మామూలుగా ఉండదు.. అనే సంకేతాలు పంపించేస్తున్నాయ్.
సంక్రాంతి అంటే ఇప్పుడు ఉందా? ఇంకో 9 నెలలు పైమాటే. సాధారణంగా సంక్రాంతి సినిమాలంటే.. అక్టోబరు, నవంబరులో డిసైడ్ అవుతాయి. ఇంత త్వరగా సంక్రాంతి సీజన్‌పై కర్చీప్ వేశారంటే.. మహేష్, పవన్ సినిమాల ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. మహేష్ సర్కారు వారి పాట, పవన్ వీరమల్లు (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) ఒకే సీజన్లో రావడం ఆసక్తి కరమే. ఇద్దరి మధ్యా పోటీ నువ్వా? నేనా? అన్నట్టు సాగుతుంది.కాకపోతే.. మిగిలిన సినిమాలకు ఇప్పుడు భయం పట్టుకుంటుంది. సంక్రాంతికి రావాలనుకున్న కొన్ని సినిమాలు.. ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి 4 సినిమాలొచ్చాయి. వచ్చే సంక్రాంతికి ఈ రెండు సినిమాలే విడుదల కావొచ్చు. ఎందుకంటే.. ఇద్దరు పెద్ద స్టార్స్ తో పోటీ పడాలని ఎవరు మాత్రం అనుకుంటారు?
మహేష్ `సర్కారు వారి పాట` పూర్తి కమర్షియల్ సినిమా. `గీత గోవిందం`లాంటి హిట్ ఇచ్చిన పరశురామ్ చేస్తున్న సినిమా ఇది. ఈ కాంబో పై బోలెడన్ని అంచనాలున్నాయి. పైగా మహేష్ కి సంక్రాంతి కలిసొచ్చిన సీజన్. దసరాకి ఈ సినిమా విడుదల చేద్దామనున్నార్ట. అయితే మహేష్ మాత్రం పట్టుబట్టి.. సంక్రాంతి సీజన్ కి తీసుకొస్తున్నాడు. ఇక పవన్ సినిమా. దాని గురించి చెప్పేదేముంది? పవన్ నుంచి వచ్చే ఫ్లాప్ సినిమా అయినా, రికార్డు స్థాయిలో ప్రారంభ వసూళ్లు దక్కించుకుంటుంటుంది. పవన్‌కి ఉన్న స్టామినా అది. అలాంటిది సంక్రాంతి సీజన్లో పవన్ సినిమా వస్తే..ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. సాధారణంగా క్రిష్ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తాడు. అలాంటిది ఈ సినిమాకి ఇంత టైమ్ తీసుకుంటున్నాడంటే… ఫోకస్ ఏ రేంజులో పెట్టాడో అర్థం చేసుకోవొచ్చు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడం, క్రిష్ సినిమాలన్నీ కథా పరంగా బలంగా ఉండడం.. పవన్ సినిమాకి కలిసొచ్చే విషయాలు. సో.. అటు పవన్, ఇటు మహేష్ లతో 2022 సంక్రాంతి ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఇవి రెండూ హిట్ అయితే.. 2022కి ఓ బంపర్ బూస్టప్ వచ్చేస్తుంది. వీటితో పోటీ పడే సినిమాలున్నాయా? ఉంటే అవేంటి? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.