కాటమరాయుడు ఫైనల్ రిపోర్ట్ కాస్త అటు ఇటుగానే ఉంది. ఫ్యాన్స్ కోసం ఈ సినిమా అంటూ విమర్శకులు తేల్చేశారు. కొంతమంది ఫ్యాన్స్ సైతం..`పవన్ ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుణ్ణు` అనే టైపులో మాట్లాడుతున్నారు. సినిమాని చుట్టేశారు అనే మాట కాస్త ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ కూడా చేతులారా కొన్ని తప్పులు చేశాడు. ఆ ప్రభావమే ఈ రిజల్ట్!
పవన్ సినిమా వస్తోందంటే ఆయన అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డులు సృష్టించగల స్టామినా పవన్‌కి ఉంది. అందుకే మార్కెట్ వర్గాలు సైతం పవన్ సినిమా వస్తోందంటే కొత్త హుషారు తెచ్చుకొంటుంది. టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఏకంగా రూ.20 కోట్ల పైచిలుకు వసూళ్లు, అదీ సర్దార్ గబ్బర్ సింగ్ అంత ఫ్లాప్ అయినా కూడా.. ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే అది కేవలం పవన్‌పై భరోసానే. అలాంటప్పుడు తన సినిమా విషయంలో పవన్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? తన స్టైలింగ్ క్యారెక్టరైజేషన్ లాంటి విషయాల్లో ఎంత ఆలోచించాలి. ఫైట్స్ ఓకే. కానీ పాటల వరకూ వస్తే పవన్ ఒళ్లు ఒంచడం లేదు. నడుం నొప్పి కారణంగా పవన్ డాన్సులు చేయలేకపోతున్నాడని సమర్థించుకొన్నా… డాన్సుల విషయంలో పవన్ ముందు నుంచీ ఇంతే. కేవలం అభిమానుల్ని దృష్టి లో పెట్టుకొనే సినిమాలు చేయకూడదు.కామన్ ఆడియన్స్ నీ మెప్పించాలి. ఆ విషయంలో పవన్ విఫలమవుతున్నాడే అనిపిస్తోంది. ప్రతీ సినిమా దేవుడి భిక్ష అనుకొంటా.. ప్రతీ సినిమాకీ ఒళ్లు వంచి కష్టపడతా… అంటూ కాటమరాయుడు ఫంక్షన్లో వ్యాఖ్యానించాడు పవన్. అయితే.. అంత కసరత్తు కాటమరాయుడు విషయంలో కనిపించలేదు.
అగ్ర దర్శకులతో (త్రివిక్రమ్‌ని మినహాయిస్తే) పవన్ పనిచేయడానికి ససేమీరా అంటున్నాడు. కొత్తవాళ్లతో, అదీ ఒకట్రెండు సినిమాలు చేసినవాళ్లతో పనిచేయడంలో ఉన్న ఉత్సాహం సీనియర్లతో చేయడానికి ఎందుకు ఉండదు? ఎందుకంటే స్టార్ దర్శకులు పవన్ తానా అంటే తందానా అనరు కాబట్టి. కొత్త వాళ్లతో అయితే `చెప్పి చేయించుకోవచ్చు` అనే ధీమాతోటి. పవన్‌కి కావల్సింది డమ్మీ డైరెక్టర్లే అనేది ఆయన గురించి తెలిసినవాళ్లంతా చెప్పేమాట. కొత్త వాళ్లకు ఛాన్సులివ్వడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. కాటమరాయుడు, సర్దార్ సినిమాలు చూస్తే.. పవన్ తన దర్శకులకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడో అర్థమవుతోంది. ఇకనైనా పవన్ పద్ధతి మారాలి. తన సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసే ఫ్యాన్స్ అంచనాలకు, వాళ్ల ఆశలకు తగ్గట్టుగా కనిపించాలంటే ఇంకేదో మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. తన సామర్థ్యానికి తగ్గట్టు కష్టపడితే చాలు. పవన్ నుంచి ఫ్యాన్స్ ఆశించేది యావరేజ్లూ.. ఎబౌ యావరేజ్లూ కాదు. ఓ సూపర్ డూపర్ హిట్. అది ఇవ్వాలంటే ఇలాంటి అల్లాటప్పా ఎఫెక్ట్ సరిపోదు. పవన్ కాస్త ఒళ్లు వంచు… నీ కోసం కాదు… నీ ఫ్యాన్స్ కోసం.