నే తీసిందే సినిమా అనుకొంటారు కొంతమంది. పవన్ కల్యాణ్ కూడా అదే బాపతు. తన క్రియేటివిటీపై పవన్‌కి అపారమైన నమ్మకం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి పరోక్ష దర్శకుడు, తెర వెనుక సూత్రధారి… పవన్ కల్యాణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొత్తం పవన్ కల్యాణ్ తన భుజ స్కంధాలపై వేసుకొని నడిపించేశాడు. బాబీని డమ్మీ దర్శకుడిగా మార్చేశాడు. పవన్ మనసులో ఏమనున్నాడో… దాన్ని తెరపై అలానే దింపేశాడు. తీరా సినిమా చూస్తే 2 గంటల 45 నిమిషాలొచ్చింది. సెన్సార్ కీ ఇంత నిడివి ఉన్న సినిమానే వెళ్లింది. కటింగులేం లేవు కాబట్టి… పావు తక్కువ మూడు గంటల సినిమా సిద్ధమైంది.
నిడివి మరీ ఎక్కువ ఉంది.. అంటూ శరత్ మరార్, బాబిలు భయపడుతున్నా పవన్ మాత్రం దీమాగానే ఉన్నాడు. సినిమా బాగుంటే.. మూడు గంటలైనా చూస్తారని పవన్ నమ్మకం. అయితే.. అది నిన్నటి వరకే. ఈ రోజు సడన్‌గా పవన్‌కీ భయం పట్టుకొంది. సినిమా లెంగ్తీ గా ఉంటే… మొదటికే మోసం వస్తుందని కంగారు పడుతున్నాడట. అందుకే ఆఘమేఘాలమీద ఈ సినిమా లెంగ్త్ తగ్గించే పనిని దర్శకుడు బాబికి అప్పగించినట్టు సమాచారం. కనీసం 15 నిమిషాల సినిమాని ట్రిమ్ చేయమని పవన్ ఆదేశించాడట. యాక్షన్ ట్రాక్ యధావిధిగా ఉంచి, అవసరమైతే కామెడీ సీన్లను కుదించమని సూచించాడట. దాంతో బాబి.. ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కుస్తీలు పడుతున్నట్టు టాక్. మొత్తానికి నిడివి విషయంలో ఎంతటి టాప్ హీరోలైనా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే అని గబ్బర్ మరోసారి రుజువు చేసింది.