డెడ్ లైన్‌లోపు రైతులకు ఎకరాలకు ముఫ్పై వేల పరిహారం ఇవ్వకపోతే.. అసెంబ్లీని ముట్టడిస్తామని వకీల్ సాబ్ చెప్పాడని.. సీఎంసాబ్కి చెప్పండి.. అంటూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్… గుడివాడ, మచిలీపట్నం నానిలకు తేల్చిచెప్పారు. నివార్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇంత వరకూ పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఎకరానికి ముఫ్పై వేలు ఇవ్వాల్సిందేనంటూ.. జనసేన పోరాటం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేసి.. కలెక్టర్లకు విజ్ఞాపనా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ మచిలీపట్నంలో ఉండటంతో.. గన్నవరం నుంచి ఆయన మచిలీపట్నం వరకూ భారీ ర్యాలీ నిర్వహిస్తూ… ముందుకు సాగారు.
పవన్ కల్యాణ్ తన దారిలో గుడివాడలోనూ ఆగారు.. మచిలీపట్నంలో సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా… మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై విరుచుకుపడ్డారు. శతకోటి నానిల్లో.. బోడిలింగాల నానిలు ఉన్నారని… ఎవరైతే మనకేంటని ప్రశ్నించారు. వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని నానిలకు తేల్చి చెప్పారు.
సీఎం జగన్ అసెంబ్లీలో ఎవరిరైనా అవమానించాలనుకుంటే.. వారెవరో తెలియదన్నట్లుగా వారి పేర్లు ఏమిటి అని పక్కనున్న ఎమ్మెల్యేలను అడుగుతారు. అసలు అసలు పేర్లు చెప్పకుండా… రామానాయుడు అయితే డ్రామానాయుడు అని చెబుతారు. జగన్ కూడా అదే పేరుతో పలకడం ప్రారంభిస్తారు. అచ్చంగా అదే స్టైల్లో పవన్ కల్యాణ్ కూడా .. తన స్పీచ్ ఉండేలా చేసుకున్నారు. ” ఏంటయ్యా ఆయన పేరు? ఏదో నానిలే. ఏం గుర్తుపెట్టుకుంటాం. నానిలు ఎక్కువైపోయారు. అదేదో నాని గారట. మీ సీఎం సాబ్‌కు చిడతలు కొట్టింది చాలు. పని చేయవయ్యా ముందు…” అని ఘాటుగానే హెచ్చరికలు జారీ చేశారు.
అసలు విశేషం ఏమిటంటే… కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ పవన్ కల్యాణ్‌పై అసభ్యమైన వ్యాఖ్యలతో విరుచుకుపడేవారే. ఎప్పుడు జనసేన ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేసినా.. వారిద్దరూ తిట్లతో విరుచుకుపడతారు. అలాంటిది పవన్ కల్యాణ్… ఒకే రోజు.. ఇద్దరి నియోజకవర్గాల మీదుగా పర్యటనలు చేయడం.. ఆసక్తి రేపింది. తన పర్యటనలో.. ఇంత కాలం తనను తిట్టిన తిట్లకు పవన్ కల్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.