జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ అమరావతిని ఫిక్స్ చేసుకున్నారు. అమరావతిని అడ్డుకుంటామని… రాజదాని ఆపేస్తామని ప్రకటించారు. విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన 2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సులో పవన్ కల్యాణ్.. చాలా దూకుడైన విమర్శలుచేశారు. 1850 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని చంద్రబాబు చెప్పారని.. ఇప్పుడు అది లక్ష ఎకరాలకు పెరిగిపోయిందని పవన్‌కల్యాణ్ విమర్శించారు. అడ్డగోలుగా భూములను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా?…తోలు తీస్తాం అని హెచ్చరించారు. అడ్డగోలుగా దోచేస్తున్నారు… భూదోపిడీని అడ్డుకుంటామన్నారు.
అమరావతి విషయంలో మహారాష్ట్ర తరహాలో రైతు, ప్రజా పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి రాజధానికి తరలి వస్తామని.. ముఖ్యమంత్రి ఇంటి ముందు కూర్చుంటామని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి మా రాజుకాదు …ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదన్నారు. అధికారులు కూడా సిఎం చెప్పారని ఎదిపడితే అది చేయవద్దని సూచించారు. రైతులు భయపడ వద్దు, కేసులు పెడితే ఎదురు తిరగమని సలహా ఇచ్చారు. రాజకీయాలు కలుషితం అయ్యాయని ..వాటిని ఎంతోకొంత బాగుచేయడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
భూసేకరణ చట్టంపై సదస్సుపేరుతో జరిగిన సమావేశంలో.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల్, ఐవైఆర్ కృష్ణారావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, సుప్రీంకోర్టు లాయర్ సిరిపురపు ఫ్రాన్సిస్ సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు. వీరందరూ భూసేకరణ చట్టం గురించి చర్చించలేదు. కానీ.. అమరావతి భూములపై మాత్రం వివరంగా మాట్లాడారు. టీడీపీతో విబేధాలు వచ్చిన తర్వాత అమరావతిపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఐవైఐర్ ప్రభుత్వం పరిమితికి మించి భూసేకరణ చేయడంతో సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. భూసేకరణ బూచీని చూపి రాజధానిలో ల్యాండ్‌పూలింగ్ చేశారని తేల్చారు. నల్లధనం చేతులు మారడానికి ల్యాండ్‌పూలింగ్ ఉపయోగపడిందని రిటైర్డ్ ఐఏఎస్ దేవసహాయం తేల్చారు. ప్రజలు ఐదేళ్లు అధికారమిస్తే… పాలకులు ఇష్టారాజ్యంగా మార్చేశారు అని ఆవేదన పడిపోయారు. సదుపాయాలు కల్పిస్తే… ప్రజలే నగరాన్ని నిర్మించుకుంటారని సలహా ఇచ్చారు.