జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాలో, సోషల్ మడియాలో జనసైనికులు వ్యవహరిస్తున్న తీరుపై కలత చెందినట్లుగా కనిపిస్తున్నారు. ఇతర పార్టీల రాజకీయ వ్యూహంలో చిక్కుకుపోయి సొంత పార్టీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందుతన్నారు. అందుకే వారి కోసం ఓ లేఖ రాశారు. మనకు సానుకూలంగా ఉన్న పక్షాల విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి వారిపై జనసైనికులు తీవ్ర విమర్శలు చేసేలా.. ఆ పార్టీ నేతల కుటంబసభ్యులను కించపరిచేలా రెచ్చగొడుతున్నారని.. అలాంటి ట్రాప్లో పడవద్దని జనసైనికుల్ని పవన్ కోరారు.
పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మాట్లాడే ప్రతీ మాట పార్టీపై ప్రభావం చూపుతుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా ఆ వ్యక్తి కుటుంబసభ్యుల పేర్లను ప్రస్తావించవద్దని పవన్ స్పష్టం చేశారు. మొత్తంగా నాలుగు సూచనలు జనసైనికులకు చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయవద్దన్నారు. మీడియాలో వచ్చిందనో ఎవరో చెప్పారనో నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడవద్దని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో తానే మేలు చేసే నిర్ణయం తీసుకుంటానని.. పవన్ ఈ సందర్శంగా సూచించారు. అలాగే జనసేనతో సయోధ్యలో ఉన్న పార్టీ నేతలు ఎవరైనా చిన్నా చితకా నేతలు విమర్శలు చేస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలన్నారు. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దన్నారు.
పవన్ కల్యాణ్ ఈ మాటలన్నీ ఎక్కువగా మీడియా, సోషల్ మీడియాలో జనసైనికులం అంటే తామేనని భావిస్తూ.. పక్క పార్టీలపై విరుచుకుపడేవారి గురించి చెప్పినట్లుగాభావిస్తున్నారు. ఇలాంటి వారి పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో ఉన్నారు. వారంతా ఇతర పార్టీల వారిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటారు. మాటకు ముందు కుల ప్రస్తావన తీసుకు వస్తూ ఉంటారు. వీరంతా ఐ ప్యాక్ టీములేమోననే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే వైసీపీకి చిన్న కష్టం వచ్చినా బాధపడతారు.. కానీ టీడీపీ, చంద్రబాబుపై ఇష్టారీతిన విమర్శలు చేస్తూ ఉంటారు. వీరిని ఉద్దేశించేపవన్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిసతున్నారు.