జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో వైసీపీ నేతలు గలాటా సృష్టించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సోయ అనే గ్రామంలో పంటలు నష్టపోయిన రైతుల్ని పవన్ కల్యాణ్ పరామర్శించాల్సి ఉంది. అయితే.. వైసీపీ నేతలు.. మండల స్థాయిలో కార్యకర్తల్ని తీసుకుని సోయ గ్రామ శివారుకు వచ్చి రగడ సృష్టించారు. పవన్ కల్యాణ్ గ్రామంలోకి రావొద్దంటూ పెద్ద ఎత్తున గుమికూడారు. ఈ విషయంపై ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు పెద్దగా స్పందించలేదు. చివరికి జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు.. పోలీసులు వైసీపీ నేతల్ని అక్కడ్నుంచి పంపించారు. పవన్ కల్యాణ్ రైతుల్ని పరామర్శించడానికి వచ్చారు.
అలా రావడంలో.. వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేమిటని.. జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో దారుణమైన పోలీస్ రాజ్యం నడుస్తోందని.. గూండాయిజంతో.. రాజకీయం చేస్తున్నారని.. ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో తిరగకూడదా అని ప్రశ్నలు వైసీపీ నేతల తీరు వల్ల వస్తున్నాయి. వైసీపీ నేతల తీరు గురించి తెలుసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ కూడా అదే విధంగా స్పందించారు. దాడికి ప్రతిదాడి చేయడానికి సిద్దమన్నారు. రౌడీయిజానికి అలాగే సమాధానం చెబుతామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీ నేతల తీరు అంతే ఉంది.
ఎక్కడైనా ప్రతిపక్ష నేతలు పర్యటిస్తే.. వారి మీద ఆ పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించడం దగ్గర్నుంచి పోలీసుల్ని ప్రయోగించి అరెస్ట్ చేయించడం వరకు అనేక రకాలుగా చేయిస్తున్నారు. స్వయంగా ప్రతిపక్ష నేతను విశాఖపట్నంలో అడుగుపెట్టనీయలేదంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఎపీలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ పైనా అదే తరహాలో వైసీపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమవుతోంది. వైసీపీ తరహాలోనే దాడులకు సిద్ధమన్న హెచ్చరికలను పవన్ పంపాల్సి వచ్చింది.