బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు అండగా ఉంటారని మాయావతి హామీ ఇచ్చారని చెప్పారు. వైకాపా అభ్యర్థి కరుణాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన ఏం చేశారో అందరికీ తెలుసు అన్నారు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లో వీధికొకరు ఉంటారన్నారు. ఇలాంటివాళ్లను చీల్చి చెండాడిన రుద్రకాళి మాయావతి అన్నారు. ఆమె స్ఫూర్తి తీసుకుని తిరుపతిలో గూండాగిరి చేసే కరుణాకర్ రెడ్డిని ఎదుర్కోవాలన్నారు.
జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలను సూటిగా ప్రశ్నిస్తున్నాననీ, మీరు ఏరోజైనా దళితులకు విలువనిచ్చారా అన్నారు. ఈరోజుకీ కడపలో కొన్ని ఊళ్లలో వీళ్ల నాయకుల ఇళ్లముందు నుంచి వెళ్లాలంటే… చెప్పులు చేత్తో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటివారు దళితులకు అండగా నిలబడతారా అన్నారు. దళితులను వాడుకుని గుర్తింపు ఇవ్వని పార్టీ వైకాపా అన్నారు. ఇది 2009 కాదనీ, ఇది 2019 అనీ గూండాగిరీ చేశారంటే నార తీసి కింద కూర్చోబెడతా జాగ్రత్త అని హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డి కత్తులూ కటార్లు పట్టుకొస్తారనీ, కానీ మనం ప్రజాస్వామ్య వాదులమనీ ఓటు అనే ఆయుధంతో ఎదుర్కొందామన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికే విలువ ఇవ్వని వ్యక్తి కరుణాకర్ రెడ్డి అనీ, ఆయన టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని నగలు పోయాయో ఆయనకే తెలీదన్నారు.
ప్రత్యేక హోదా గురించి పవన్ మాట్లాడుతూ… తెలుగుదేశం వారు ధర్మపోరాట దీక్షలు అంటారనీ, అంతా నేనే చేశానని జగన్ ఊగిపోతూ ఉంటారనీ, వాస్తవానికి మూడేళ్ల కిందట హోదా అంశాన్ని బయటకి తీసుకొచ్చిందే జనసేన కాదా అన్నారు. ఆ తరువాతే కదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని భాజపా ప్రకటించిందన్నారు. హోదాకి మద్దతు ఇస్తానని మాయావతి ప్రకటించారనీ, కాబట్టి మనం బీఎస్పీ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడిలా మాటలు మార్చే వ్యక్తి మాయావతి కాదన్నారు. అనంతరం, భాజపా మీద కూడా విమర్శలు చేశారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి గెలిస్తే కబ్జాలు పెరిగిపోతాయన్నారు. తిరుపతి సభలో కరుణాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలకే పవన్ ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు, దీంతోపాటు దళితులను ప్రత్యేకంగా ప్రస్థావించడం గమనించాలి. దళితుల కోసం కరుణాకర్ రెడ్డిగానీ, జగన్ గానీ ఏ రోజైనా ఏదైనా మంచి పనిచేశారా, వాడుకుని వదిలేయడం తప్ప అంటూ సూటిగా విమర్శించడం వెనక వ్యూహం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ వర్గంలో వైకాపా అభిమానులను తమవైపు తిప్పుకునే ప్రయత్నంగా ఇది వినిపిస్తోంది.