బహిరంగ సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగాలు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. భావోద్వేగాలకు లోనౌతూ, ఊర్రూతలూగుతూ మాట్లాడుతుంటారు. పార్టీ వర్గాలతోగానీ, ఇతర ఇన్ డోర్ సమావేశాల్లోగానీ పవన్ ప్రసంగం తీరు దాదాపు ఇలానే ఉంటుంది. అయితే, బహిరంగ సభల్లో మాటలకీ, సమావేశాల్లో మాటలకీ మధ్య కొంత తేడా కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి రావడం, హామీలు, ముఖ్యమంత్రి పదవి, అధికారం – పోరాటం… ఇలాంటి టాపిక్స్ మీద రెండు రకాల అభిప్రాయాలు పవన్ కి ఉన్నట్టుగా తేడా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు తాజాగా చింతలపూడిలో జరిగిన బహిరంగ సభ… జిల్లా న్యాయవాదులతో క్రాంతి కల్యాణ మటపంలో సమావేశం తీసుకుందాం!
బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ… ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం తనకు చేతకాదన్నారు. మనపై బెదిరింపులు పెరుగుతున్నాయంటే, మనం బలపడుతున్నామని అర్థం చేసుకోవాలన్నారు. తనకు భయం లేదనీ, ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదనీ, 18వ ఏటనే సాయుధ పోరాటానికి సిద్ధపడ్డానని పవన్ అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఇళ్ల మధ్య ఉన్న బార్, బెల్టు షాపులు తొలగిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే యువతకు స్థానికంగా ఉపాధి లభించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతేకాదు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలండర్లు ఇస్తామన్నారు. ఇక, న్యాయవాదులతో భేటీ సందర్భంగా మాట్లాడుతూ… తాను రాజకీయాల్లోకి వచ్చింది గెలుపు ఓటముల కోసం కాదనీ… సమాజంలో సమూల మార్పు కోసం వచ్చానన్నారు. సరిగ్గా వారం రోజుల కిందట నెల్లూరులో ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలోనూ పవన్ ఇలానే మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే పనులవుతాయన్న ఆలోచనా విధానం తనకు లేదనీ, పోరాటాన్ని మాత్రమే నమ్ముతా అన్నారు. పదవి ఒక అలంకారం మాత్రమేననీ, అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడనన్నారు.
సో… ఇదీ బహిరంగ సభలకీ, సమావేశాలకీ మధ్య ఉన్న తేడా..! అధికారంలోకి రాబోతున్నది మనమే, వస్తే అది చేస్తా ఇది చేస్తా అంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు పవన్! కానీ, కొన్ని సమావేశాలకు వచ్చేసరికి… గెలుపు ఓటములు ముఖ్యం కాదనీ, అధికారంలో ఉంటేనే పనులవుతాయని నమ్మననీ అంటున్నారు. ఇంతకీ పవన్ ధోరణి ఏంటనే కన్ఫ్యూజన్ ప్రజలకు కలిగే విధంగా ఈ వ్యాఖ్యానాలు ఉంటున్నాయి. అధికారంలోకి వస్తే ఫలానావి చేస్తామని హామీలు ఇస్తూనే… అధికారంపై నమ్మకం లేదని అంటుంటే ఎలా..? ఒకవేళ పోరాట మార్గమే పవన్ మార్గం అనుకుంటే… అధికారం గురించి ప్రస్థావన వద్దు. అధికారమే పరమావధి అనుకున్నప్పుడు పోరాటం మాత్రమే పరిష్కారం మార్గం అనొద్దు కదా..! వాస్తవానికి, సమాజంలో మార్పు కోరుకునే ఏ రాజకీయ పార్టీ అయినా అది అధికారంతోనే సాధ్యమని నమ్ముతుంది. కానీ, పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో పవన్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.