నటుడు షాయాజీ షిండేలో ఓ పర్యావరణ ప్రేమికుడు ఉన్నాడు. ఆయన మాతృమూర్తి మరణిస్తే, ఆమె బరువుకు సరితూగే విత్తనాల్ని చాలా ప్రాంతాల్లో నాటారు. ఆ మొక్కలు పెరుగుతూ వృక్షాలుగా మారుతుంటే, వాటిలో తన తల్లిని చూసుకొన్నారు. ఆలయాలకు వెళ్లే భక్తులకు ప్రసాదంతో పాటు ఓ చిన్న మొక్క ఇస్తే… వాటిని భక్తిభావంతో నాటితే, వృక్ష సంపద పెరుగుతుందని, పర్యావరణాన్ని కాపాడేవాళ్లం అవుతామన్న వినూత్న ఆలోచన చేశారు. మహారాష్ట్రలో మూడు ప్రధానమైన ఆలయాలు ఇప్పటికే `వృక్ష ప్రసాద్` ఆలోచనని అమలు చేస్తున్నాయి. వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇదే ఆలోచన పవన్ కల్యాణ్ వరకూ తీసుకెళ్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మారు. ఇప్పుడు అదే జరిగింది. షాయాజీ షిండే పవన్ కల్యాణ్ ని కలుసుకొన్నారు. పర్యావరణంపై తనకున్న ఆలోచనల్ని ఆయనతో పంచుకొన్నారు. షాయాజీ ఐడియాలజీ తెలుసుకొన్న పవన్… వాటిని స్వాగతించారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఓ మొక్కని ఇవ్వడం మంచి ఆలోచన అని, దాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామని షాయాజీ షిండేకు పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మొక్కలు, వాటి విశిష్టత గురించి షాయాజీ షిండే మరాఠీలో రాసుకొన్న కవితను పవన్ ముందు చదివి వినిపించారు. ఈ మరాఠీ కవితను పవన్ అప్పటికప్పుడు తెలుగులో అనువదించి, షాయాజీకి వినిపించారు. పవన్ పర్యావరణ ప్రేమికుడు. పైగా ఇప్పుడు అటవీ పర్యావరణ మంత్రి కూడా. అందుకే షాయాజీ షిండే ఆలోచన గురించి తెలుసుకొని, దాన్ని అమలు పరచడానికి తక్షణం రంగంలోకి దిగారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కలు ఇవ్వడం చాలా మంచి ఆలోచన. ఇది అమలైతే… రాష్ట్రం మొత్తం పచ్చదనంతో నిండిపోవడం ఖాయం.