పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆయనకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయి. అయితే వాటిని అప్పుల కేటగిరిలో చూపించి ఉండవచ్చు కానీ వాస్తవానికి అవి సినిమాలు చేసేందుకు తీసుకున్న అడ్వాన్సులు. వివిధ సినీ నిర్మాణ సంస్థలు, వాటి నిర్మాతల దగ్గర నుంచి పర్సనల్ లోన్ రూపంలో తీసుకున్నారు. సినిమాలు చేసినప్పుడు వాటిని రెమ్యూనరేషన్ల రూపంలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే కొన్ని సినిమాలు చేస్తున్నారు. పవన్ తీసుకున్న అడ్వాన్సుల ప్రకారం చూస్తే మరో రెండేళ్ల పాటు ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఆయన గెలిచినా ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి అధికార బాధ్యతలు తీసుకునే అవకాశం ఉండదు. కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ కు సినిమాలు చేసే తీరిక ఉండదు. ఆయన ప్రభుత్వంలో భాగం అయినా కాకపోయినా అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత కూడా సినిమాలు చేస్తే పవన్ రాజకీయాలపై సీరియస్ నెస్ పోతుంది.అందుకే కూటమి గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ .. ముగింపు దశకు వచ్చిన సినిమాలు పూర్తి చేసి.. తర్వాత విరామం ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అడ్వాన్సులన్నీ ఎవరివి వారికి తిరిగి ఇస్తారని అంచనా వేస్తున్నారు.