జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత ప్రచారానికి వస్తారని ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు క్వారంటైన్ షాక్ తగిలింది. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లుగా తేలడంతో పవన్ కల్యాణ్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రచార గడువు పదిహేనో తేదీ వరకు మాత్రమే ఉంది. ఈలోపు ఓ సారి తిరుపతికి లేదా నెల్లూరుకు పవన్ కల్యాణ్‌ను రప్పించి మరో పవర్ ఫుల్ స్పీచ్ ఇప్పించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి వస్తారని.. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ కూడా సభలో పాల్గొంటారని ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశారు.
కానీ పవన్ కల్యాణ్ క్వారంటైన్‌కు వెళ్లడంతో ఆ ప్లాన్ మొత్తం అప్ సెట్ అయింది. ఇప్పటికే బీజేపీ ప్రచారంలో వెనుకబడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పెద్దగా క్యాడర్ లేకపోవడం ఉన్న నేతలకు జనాకర్షణ శక్తి లేకపోవడంతో ఎక్కువగా ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో.. చివరిలో పుంజుకునేలా పవన్ కల్యాణ్ వచ్చి మాట సాయం చేస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ అడిఆశలయ్యాయి. అయితే పార్టీ కార్యక్రమాలను పవన్ కల్యాణ్ వర్చువల్ ద్వారా సమీక్షిస్తారని జనసేన తెలిపింది.
అంటే.. కావాలంటే.. పవన్ కల్యాణ్.. వీడియో సందేశం ఇవ్వడం ద్వారానో లేకపోతే.. ఆన్ లైన్ మీటింగ్ ద్వారానో.. బీజేపీకి ప్రచారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓ వైపు అగ్రనేతలందరూ.. తిరుపతిలో బిజీగా ప్రచారం చేస్తూండగా పవన్ వర్చువల్ సమావేశం నిర్వహిస్తే పెద్దగా ఆసక్తి ఉండదని బీజేపీ నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. మొత్తానికి తిరుపతి ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేయాలనుకుంటున్న బీజేపీకి… ఏ ఒక్కటీ కలసి రావడం లేదు.