ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే పార్టీ నిర్మాణంపై పూర్తి శ్రద్ధ పెడుతున్నామనీ, రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు పవన్ చెప్పారు. ఇక, అన్ని స్థానాల్లో పోటీకి సై అన్నారు కాబట్టి, దానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఈనెల 15 నుంచి పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు బయలుదేరనున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
పర్యటనలో భాగంగా బహిరంగ సభలు ఉంటాయి. ప్రతీ జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. స్థానికంగానే గ్రామాల్లోనే బస చేస్తారు. ఈ పర్యటనలోనే జిల్లాకి వందమంది చొప్పున జన సైనికులను ఎంపిక చేస్తారు. వీరిలోంచి బాగా చురుగ్గా ఉన్నవారిని ఎంపిక చేసి, ఆయా జిల్లాల్లో పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. బస్సుయాత్ర తరువాత ఎన్నారైలను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనకు కూడా పవన్ వెళ్లనున్నారని సమాచారం.
ఈ బస్సుయాత్రలో ప్రధాన ప్రచారాంశాలు ఏంటంటే… ప్రత్యేక హోదా, టీడీపీ పాలన! రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలకు వివరించడంతోపాటు, కేంద్రం చేసిన అన్యాయాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, టీడీపీ సర్కారుపై విమర్శలు చేసేందుకు కొంత కసరత్తు కూడా చేస్తున్నట్టు సమాచారం. టీడీపీపై ఇప్పటికే పవన్ కొన్ని సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. మంత్రి నారా లోకేష్ అవినీతి అన్నారు. కానీ, వాటికి సంబంధించి ఆధారాలేవీ ఇంతవరకూ చూపలేకపోయారు. బస్సు యాత్ర సందర్భంగా కొన్ని ఆధారాలతోనే టీడీపీని నిలదీయాలని పవన్ భావిస్తున్నారట! సో.. ఈ యాత్రతో జనసేన ఎన్నికల ప్రచారం మొదలైపోయినట్టే చెప్పాలి. అన్ని నియోజక వర్గాల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమన్నారు. ఇప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ఇంకోపక్క, ఇదే క్రమంలో పార్టీ నిర్మాణం కూడా అంటున్నారు. ఒక్క బస్సు యాత్రతో అన్నీ సెట్ చేసేయాలని పవన్ ఆశిస్తున్నట్టుగా ఉంది. నిజానికి, బస్సు యాత్ర మినహా పార్టీ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ గతంలోనే చేసుకోవచ్చు. కానీ, గడచిన నాలుగేళ్లలో ఆ ప్రయత్నమే జరగలేదు. ఇప్పుడు ఆత్రత పడుతున్నారు.