నాలుగు మాసాల చాతుర్మాస దీక్ష కారణంగా మొన్నటి వరకు బయట పెద్దగా కనిపించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయం గా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు ని జనసేన పార్టీ తరఫున సందర్శించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి గా భావించే పోలవరం ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ప్రతి రాజకీయ పార్టీ, మా హయం లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి కేంద్రప్రభుత్వం మీరు లేదంటే గత ప్రభుత్వం మీద నెపాన్ని నెట్టేసి కాలక్షేపం చేయడం పరిపాటిగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా పోలవరాన్ని పూర్తి చేస్తామని బలంగా చెప్పింది. అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2018 లోపు పనులు పూర్తి కావు అని వ్యాఖ్యలు చేస్తే, అప్పటికీ పవన్ కళ్యాణ్ తమకు మిత్రపక్షం లో ఉన్నాడు అని కూడా చూడకుండా తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు.
ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి, 2021 లోపు పోలవరం పూర్తి చేసి చూపిస్తామని సవాల్ విసిరింది. తీరా సమయం దగ్గరపడే సరికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్లేటు ఫిరాయించి, కేంద్ర ప్రభుత్వమే దీని పూర్తి చేయాలని ఒకసారి, కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత సోము వీర్రాజు దే అని ఇంకొకసారి, మాటలు మారుస్తూ వస్తున్నారు. వీటన్నిటికి తోడు , ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు తగ్గించే పనులు కూడా వైఎస్ఆర్సిపి చేస్తోందని ఆరోపణలు ప్రత్యారోపణలు వెలువడుతున్న సమయంలో, పవన్ ళ్యాణ్ పోలవరం సందర్శనకు పూనుకోవడం ఆసక్తి రేపుతోంది. పైగా గతం లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం కోసం అంచనాలు పెంచుతోంది అని, నిజంగా అన్ని నిధులు అవసరం లేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వై ఎస్ ఆర్ సి పి మీద ప్రయోగించడానికి బలమైన ఆయుధంగా మారింది.
ఈ నేపథ్యంలో, క్షేత్ర స్థాయిలో రాజకీయ విజయాన్ని సాధించగల బలం లేకపోయినప్పటికీ, తన లేదా తన పార్టీ రాజకీయ ప్రయోజనాల ను పట్టించుకోకుండా, ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు అని ప్రజల్లో విశ్వసనీయత పెంచుకున్న పవన్ కళ్యాణ్ పోలవరం పర్యటన సందర్భంగా ఏం మాట్లాడతాడు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మరి త్వరలోనే పోలవరం పర్యటన చేయనున్నాడు అన్న వార్తలు ఏ మేరకు నిజమవుతాయని వేచి చూడాలి.