పవన్ కల్యాణ్ రాజకీయంగా చాలా యాక్టీవ్ అవుతున్నారు. ఇప్పుడు సినిమాలు… తన రెండో ఛాయిస్‌గా మారుతూ వస్తున్నాయి. పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోతాయా? అనే కంగారూ పట్టుకుంది అభిమానులకు. కానీ `సినిమాలు సినిమాలే, రాజకీయాలు రాజకీయాలే` అన్నట్టు ఆయన మళ్లీ ఫిల్మీ మూడ్‌లోకి వచ్చారు.
పవన్ – క్రిష్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం `హరి హర వీరమల్లు`. ఏఎం రత్నం నిర్మాత. ఈ సినిమా సగం వరకూ షూటింగ్ జరుపుకుని… ఆగిపోయింది. పవన్ ఎప్పుడొస్తాడా అని క్రిష్ ఎదురు చూడడం, షెడ్యూల్ వేసుకుని, ఆ తరవాత కాన్సిల్ చేసుకోవడం జరుగుతూ వస్తున్నాయి. ఈ వారంలో కూడా ఓ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. కాకపోతే.. పవన్ వల్ల ఈ షెడ్యూల్ కూడా మొదలవ్వదని ప్రచారం జరిగింది. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ చిత్రబృందం కొత్త అప్ డేట్ ఇచ్చింది.యాక్షన్ సన్నివేశాల కోసం… పవన్ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. `హరి హర వీరమల్లు`లో యాక్షన్ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. అందుకే ప్రాక్టీస్ అవసరమైంది. ఓ సీన్ కోసమో, ఫైట్ కోసమో.. ఇలా రిహార్సల్ చేసి పవన్ కి చాలా కాలం అయ్యి ఉంటుంది. పవన్ రంగంలోకి దిగాడంటే.. అతి త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోందన్నమాట. క్రిష్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం పవన్ కి ఉంది. ఎందుకంటే.. ఆ వెంటనే హరీష్ శంకర్ సినిమాని మొదలెట్టాలి. అందుకే ఇప్పుడు వెసులుబాటు చేసుకొని, క్రిష్ సినిమాకి డేట్లు ఇచ్చేశాడు,.