జనసేన అధినేత పవన్ కల్యాణ్… పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఎప్పుడూ లేని విధంగా.. ప్రతీ ప్రసంగంలోనూ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరుగా కాదు… తనకేం భయం లేదని.. తనను తాను కాపాడుకుంటానని చెబుతూనే.. ప్రభుత్వంపై అనుమానాలు వచ్చేలా ఆరోపణలు చేస్తున్నారు. మొన్న తనను చంపడానికి ముగ్గురు వ్యక్తులు ప్లాన్ చేశారని… వారే పార్టీకి చెందిన వారో తెలియకపోయినా… వారెవరో మాత్రం తెలుసన్నారు. ఆడియో టేపులు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఆడియో టేపులను స్వాధీనం చేసుకుని.. జనసేనానిపై కుట్ర చేసిన ఆ ముగ్గురి సంగతి తేల్చాలని ప.గో ఎస్పీ రవిప్రకాష్‌ను ఆదేశించారు కూడా. కారణం ఏమిటో కానీ..పవన్ కల్యాణ్ మాత్రం ఆ టేపులు ఇవ్వడానికి.. ఆ ముగ్గుర్ని పట్టించడానికి సిద్ధంగా లేరు.
పైగా.. ప.గో పోరాటయాత్రలో తన భద్రత విషయంలో ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. తనపై .. తన ఇంటిపై ప్రభుత్వం డ్రోన్లతో నిఘా పెట్టిందని ఆరోపణలు గుప్పించారు. తన వద్ద ఏం నిఘా సమాచారం ఉంటుందని ఆవేశపడ్డారు. దోపిడీదారునా? మోసగాడినా? అని పవన్ ప్రశ్నించారు. గతంలో ఆవిర్భావ దినోత్సవ సభ రోజున తనకు సెక్యూరిటీ కావాలని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ అడిగారు. నలుగురు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది. కానీ కొద్ది రోజులకే వాటిని తిరిగి పంపించేశారు. ఆ సెక్యూరిటీలో ఒకరు తన సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేసేవారని పవన్ ప్రకటించారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదని, ఎలా రక్షించుకోవాలో తెలుసునని పవన్ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ప్రాణాల మీద ఆశలు వదిలేశానన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తనపై నిఘా ఉందని పదే పదే ఆరోపిస్తున్నారు. ఆ కారణంగానే గన్మెన్లను వెనక్కి పంపేశారు. మొదట్లో .. అడిగి మరీ తీసుకున్న సెక్యూరిటీని ఎందుకు వెనక్కి పంపించేశారో కారణం చెప్పలేదు. కానీ… అందులో ఒకరు నేరుగా తన సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేస్తున్నారని తాజాగా చెప్పారు. ఓ సాధారణ సెక్యూరిటీ గన్‌మెన్ ముఖ్యమంత్రితో నేరుగా టచ్‌లో ఉండటం ఎలా సాధ్యమో..?.
ఇదే కాదు.. గతంలో ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు…పవన్ ఓ కల్యాణ మండపంలో బస చేశారు. ఆ సమయంలో విద్యుత్ సంస్థకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు… ఓ వినతి పత్రం ఇద్దామని వచ్చారు. కానీ పవన్ బయటకు రాలేదు. దాంతో వారు కరెంట్ తీసేశారు. ఆ తర్వాత తాను పోరాటయాత్రకు వెళ్తూంటే.. పెద్ద ఎత్తున గేదెలు వచ్చాయి. ఆ కరెంట్ తీయడానికి.. ఈ గేదెలు అడ్డు రావడానికి కూడా… కూడా.. టీడీపీ నేతలే కారణమని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తనపై ముగ్గురు వ్యక్తులు కుట్ర చేశారని పవన్ చెప్పిన తర్వాత… ఆయన సెక్యూరిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తోంది. తన సెక్యూరిటీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను.. పవన్ కల్యాణ్ నిఘా అనుకుంటున్నారు. నిఘా పెడితే తెలిసిపోయే.. రహస్యంగా ఉంచాల్సిన వివరాలు తన దగ్గర ఉన్నాయని పవన్ భావిస్తున్నారేమో కానీ… ప్రభుత్వానికి సంబంధించిన ఎవరు కనిపించినా… “నిఘా” కోసమే అని అనుకుంటున్నారు.