తితిలి తుఫాను సందర్భంగా విలవిలలాడుతున్న శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. జనసేన పార్టీ తరఫున సరుకులు, కూరగాయలు, ప్రస్తుతం జనసైనికులు శ్రీకాకుళం జిల్లా వాసులకు పంచిపెడుతున్నారు. ఇప్పటికీ కరెంటు పునరుద్ధరించబడని గ్రామాలలో పవన్ కళ్యాణ్ బస చేస్తూ, అన్ని పునరుద్ధరించేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వ ప్రకటనల లో డొల్లతనాన్ని బయటపెడుతున్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరొక ప్రకటన కూడా చేశారు.
శ్రీకాకుళంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవలసిందిగా, రామ్ చరణ్ ని తాను కోరుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అయితే ఇదే సందర్భంలో మాట్లాడుతూ, చాలామంది ప్రజలు, సినిమా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయని భావిస్తూ ఉంటారు అని, కానీ సినిమా వాళ్లకు పేరు ఎక్కువ, డబ్బు తక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉంటుందని, సినిమా వాళ్ళ కంటే చాలా ఎక్కువ డబ్బులు రాజకీయ నాయకుల వద్ద, ప్రత్యేకించి కళా వెంకటరావు, లోకేష్, రామ్మోహన్ నాయుడు లాంటి నాయకుల వద్ద ఉంటాయనీ, కానీ వారు ఒక్క పైసా కూడా బయటకు తీయరని వ్యాఖ్యానించాడు.
అయితే రామ్ చరణ్ శ్రీకాకుళంలోని ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేలా తాను చేస్తానని చెప్పిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రామ్ చరణ్ ని మాత్రమే కాకుండా, మరి కొందరు పారిశ్రామికవేత్తలని కూడా తాను కలుస్తానని, వారితో కూడా చేతనైనంత సాయం శ్రీకాకుళం కి లభించేలా తాను చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు.