జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో… సహజసిద్ధమైన.. ఆవేశంతో చేస్తున్నారో కానీ… రాజకీయాల్లో అత్యంత కీలకమైన టైమింగ్ ను మిస్సవుతున్నారు. సినిమాల్లో టైమింగ్ ఎంత కీలకమో.. పాలిటిక్స్ లోనూ అంతే కీలకం. లేకపోతే… ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లిపోతాయి. పవన్ కల్యాణ్ విషయంలో పదే పదే అదేజరుగుతోంది.
పవన్ కల్యాణ్ గతంలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పుడు కేంద్రాన్ని పూర్తి స్థాయిలో కార్నర్ చేశారు. మోదీని ఉత్తరాది అహంకారిగా అభివర్ణించారు. బీజేపీ చచ్చిపోయిందన్నారు. వెంకయ్యనాయుడినీ వదిలి పెట్టలేదు. నిజానికి అప్పుడు ప్రత్యేకహోదా ఉద్యమం అంత తీవ్రంగా లేదు. తీరా ప్రత్యేకహోదా ఉద్యమం ఓ రేంజ్ కు వచ్చిన తర్వాత… ఆయన ఆ బ్యాటన్ అందుకోవాల్సింది పోయి… ఒక్క సారిగా రూటు మార్చారు. జనసేన నాలుగో ఆవిర్బావదినోత్సవం రోజున.. ప్రజలందరూ..మోదీపై పవన్ సమరం ప్రారంభిస్తారని ఎదురు చూశారు. కానీ విచిత్రంగా మోదీని పల్లెత్తు మాట అనకుండా… కన్సన్ ట్రేషన్ అంతా చంద్రబాబు అండ్ కో పై పెట్టారు. దాంతో… పవన్ కల్యాణ్ బీజేపీతో కుమ్మక్కయ్యారనే ప్రచారం ప్రారంభమయింది. ఇప్పటికీ దాన్ని కవర్ చేసుకోలేకపోతున్నారు.
ఇక శ్రీరెడ్డి విషయంలోనూ ఇదే రిపీట్ అయింది. పవన్ కల్యాణ్ తల్లిని శ్రీరెడ్డి అభ్యంతరకరంగా తిట్టి నాలుగు రోజులైంది. అప్పటి వరకూ మాట్లాడని పవన్ కల్యాణ్.. .కచ్చితంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం.. దీక్ష చేస్తున్న రోజే… హడావుడి ప్రారంభించారు. తెల్లవారుజామున.. అదీ కూడా కచ్చితంగా చంద్రబాబు దీక్ష కు మీడియా కవరేజీ ప్రారంభమవుతున్న సందర్భంలోనే… ట్వీట్ల దాడి ప్రారంభించారు. ఆ తర్వాత ఫిల్మ్ చాంబర్ లో మెగా ఫ్యామిలీతో బలప్రదర్శన చేశారో. ఏదో చేయబోతున్నట్లు.. మీడియా ముందు హంగామా చేశారు. దీంతో… డైవర్షన్ కుట్ర అంటూ.. ప్రజల్లో ప్రచారం జరిగిపోయింది.
రాజకీయాల్లో అవగాహనా లోపంతోనే పవన్ కల్యాణ్ టైమింగ్ మిస్సవుతున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇలాంటి విషయాలను ఇతర రాజకీయ పార్టీలు తేలికగా తీసుకోవు. పవన్ కల్యాణ్ ను నానా సిరీయస్ క్యాండిటేట్ గా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. పవన్ ను సీరియస్ పొలిటిషియన్ కాదన్నట్లుగా ప్రజలు కూడా భావించే పరిస్థితి వచ్చింది. అందుకే పవన్ కల్యాణ్ ఇప్పటికైనా రాజకీయం నేర్చుకోవాలి. టైమింగ్ తో స్టెప్స్ వేయాలి. లేకపోతే…తేడా వచ్చేస్తుంది.