జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు వారాలుగా రాజకీయ యాత్రలకు విరామం ఇచ్చారు. తూ.గో జిల్లాలో జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర చేసిన తర్వాత ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు కోలుకోవడంతో ఆయన రాయలసీమలో మరోసారి కౌలు రైతు భరోసా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి కడప జిల్లానే టార్గెట్ చేస్తున్నారు. కడపలో పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కానీ ప్రభుత్వం కనీస సాయం అందించలేదని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.
20వ తేదీన పవన్ కల్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. తలా రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తారు. అయితే జగన్ అడ్డాలో పవన్ కల్యాణ్ యాత్ర ఎలా సాగుతుందనే టెన్షన్ జనసేన వర్గాలకు ఏర్పడింది. కడప శివారులో ఉండే సిద్దవటంలో సభ నిర్వహిస్తున్నారు సిద్దవటం రాజంపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అయితే నియోజకవర్గం ఏదైనా .. కడప అంటే.. వైసీపీ అడ్డా అనుకోవచ్చు. నిజానికి కడపలో ఇతర పార్టీల వారు పర్యటించాలంటే.. కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సారి జగన్‌ను టార్గెట్ చేసి మరీ పవన్ కల్యాణ్.. కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన తర్వాత అక్కడి బాధితులకు ప్రభుత్వం తరపున అందించిన దాని కంటే స్వచ్చంద సంస్థలు అందించిందే ఎక్కువ. ఇప్పటికీ అక్కడి జనం గుడారాల కింద తలదాచుకుంటున్నారు. అలాగే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులపై.. అసలు వాళ్లు రైతులే కాదనే ముద్ర వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లా ప్రజల్లోనూ జగన్ పాలపపై తీవ్ర వ్యతిరేకత ఉందని జనసేన భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ పర్యటన విజయవంతమైతే… వైఎస్ఆర్సీపీ నేతలకు ఇబ్బందులు తప్పవు. అందుకే పవన్ పర్యటనను నియంత్రించేందుకు వారు ప్రయత్నిస్తారు. అవి ఏ రూపంలో ఉంటాయనేది ఇప్పుడు జనసేన వర్గాలకు టెన్షన్‌గా మారింది. కడప టూర్‌పై నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు.