సింగపూర్ లో చదువుకుంటున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు చిన్నపాటి ప్రమాదం జరిగింది. స్కూల్ లో అగ్నిప్రమాదం జరగడంతో పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లింది. దీంతో అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం పై పవన్ కు సమాచారం రావడంతో ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. అరకు పర్యటన పూర్తయిన తర్వాత ఆయన సింగపూర్ వెళ్లే అవకాశం ఉంది.
పర్యటన రద్దు చేసుకుని వెళ్లాలని పలువురు సూచించినప్పటికీ పవన్ .. కొన్ని గ్రామాలకు వస్తానని మాటిచ్చానని ఆ పర్యటన పూర్తి చేసుకునే వెళ్తానని పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవాతో పాటు పిల్లలు సింగపూర్ లో నే ఉంటున్నారు. అన్నా లెజ్నోవా కూడా అక్కడ చదువుకుంటున్నారు. అలాగే పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ చిన్న కుమారుడికి స్కూల్లో ప్రమాదం జరిగింది.
పవన్ కల్యాణ్ పిల్లలను మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. చిన్న పిల్లలు కావడంతో వారి ప్రైవసీ కోసమే సింగపూర్ లో చదివిస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ నుంచి పవన్ సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.