ప్రత్యేక హోదాతోపాటు ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన అంశాల కోసం ధర్మ పోరాట దీక్షను అధికార తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు దీక్ష కార్యక్రమాలు పెడుతూ… కేంద్రం వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు ఎంపీలు కూడా ఇతర హామీల సాధన కోసం సంబంధిత కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. అయితే, గత కొద్దికాలంగా గమనిస్తే… ప్రత్యేక హోదాపైగానీ, ఇతర విభజన హామీల సాధన అంశమైగానీ… ప్రతిపక్ష పార్టీ వైకాపా చేస్తున్న పోరాటం ఏదీ..? ఇవే అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాగిస్తున్న పోరాటం ఏదీ..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. జగన్ గానీ, పవన్ గానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను కేంద్రం ఎగ్గొట్టిన క్రమాన్ని మరచిపోయినట్టు కనిపిస్తున్నారు! ముఖ్యమంత్రి ఒక్కర్నే లక్ష్యంగా చేసుకుని పోరాటాలు చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ వైకాపా పోరాటమే తీసుకుంటే… మొదట్నుంచీ హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చిందే తామనీ, జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారంటూ ఊదరగొట్టుకుంటూ వచ్చారు. అంతేకాదు… కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగాలన్నారు. టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామాలు చెయ్యాలన్నారు. కేంద్రంపై చంద్రబాబు పోరాటం ప్రారంభించాలనీ బలంగా కోరింది వారే. దానికి అనుగుణంగానే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేసింది, కేంద్రంపై చంద్రబాబు నాయుడు పోరాటం ప్రారంభించారు. కానీ, ఆ తరువాత ఏమైంది…? కేంద్రంతో వైకాపా సాగిస్తున్న పోరాటం ఎక్కడుంది..? భాజపా టీడీపీల మధ్య పొత్తు తెగిన దగ్గర్నుంచీ చూసుకుంటే.. దశలవారీగా హోదా పోరాటాన్ని జగన్ పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఎంపీల రాజీనామాల వరకూ కాస్తోకూస్తో మాట్లాడినవారు.. ఆ తరువాత, ఆ అంశం వదిలేసి… ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మాత్రమే పోరాటాలు చేస్తున్నారు.
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికొద్దాం. హోదాపై తొలిసారి గళమెత్తింది తానే అంటూ పవన్ కూడా చాలాసార్లు చెప్పారు. హోదా సాధించి తీరతామంటూ ప్రతిజ్ఞలు చేశారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెడితే.. దేశవ్యాప్తంగా పర్యటించి మద్దతు కూడగడతా అన్నారు. కానీ, ఆ తరువాత ఏమైందీ.. పవన్ లక్ష్యం కూడా టీడీపీ మాత్రమే అన్నట్టుగా మారిపోయింది. బస్సుయాత్ర మొదలయ్యాక.. హోదా అంశాన్ని, కేంద్రంపై పోరాటాంశాన్ని ఆయన కూడా వదిలేసిన పరిస్థితే.
ప్రత్యేక హోదా విషయంలో జగన్, పవన్ ల పోరాటం తీరు చూస్తుంటే… వీరు హోదా పేరుతో ఉద్యమించాలనుకున్నది, కొన్నాళ్ల పాటు కార్యక్రమాలు చేసిందీ కేవలం టీడీపీపై విమర్శలు చేయాలనే లక్ష్యంతోనా అనిపిస్తోంది! ఇవ్వాల్సిన కేంద్రాన్ని, పోరాటం చెయ్యాల్సిన భాజపా సర్కారునీ వైకాపా, జనసేనలు వదిలేశాయి. ఏపీలో ఇప్పుడు హోదా కోసంగానీ, కేంద్ర హామీల అంశమైగానీ టీడీపీ మినహా ఇతర పార్టీలు చేస్తున్న పోరాటాలేవీ..? ఈ దిశగా జగన్ గానీ, పవన్ గానీ ప్రజలకు ఏం చెప్పుకోగలరు..?