మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ.. ఆయనపై కోపం వచ్చినప్పుడల్లా.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు… పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారు.. మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారని తేల్చేశారు. తాము విధానాల ప్రకారం మాట్లాడుతూంటే.. వైసీపీ నేతలు.. వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని.. మండిపడ్డారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి మేం టీడీపీ కాదు.. జనసేన అని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మధ్యాహ్నం పవన్ కల్యాణ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించన్ ను కలిశారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరతపై వినతిపత్రం ఇచ్చారు. ఇసుక కొరతతో 35 లక్షల మంది ఉపాధి కోల్పోయారని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. కార్మికులకు ఉపయోగకరంగా ఉండే ఇసుక పాలసీని రూపొందించి..పరిశీలించాలని గవర్నర్కు అందజేశారు. గవర్నర్తో భేటీ తర్వాత జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై పవన్ కల్యాణ్ కంట్రోల్ తప్పకుండా స్పందించే ్రయత్నం చేశారు. వైసీపీ నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీల ప్రకారమే స్పందిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా విమర్శిస్తూ.. వైసీపీ నేతలు ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గెలుపోటములు తెలియదు.. ప్రజా సమస్యల కోసం పోరాడటమే తెలుసని స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో ఏపీ సర్కార్ తీసుకున్న ఇంగ్లిష్ మీడియం నిర్ణయంపైనా స్పందించారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని… జగన్కు అసలు చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య గురించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అలా మాట్లాడినందుకు సిగ్గుండాలన్నారు. జగన్ వైసీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారు.. ఏపీ ముఖ్యమంత్రి అని మర్చిపోకూడదన్నారు. జగన్ ఫ్యాక్షనిస్టు ధోరణికి భయపడనన్నారు. ప్రభుత్వం తీరు వల్ల పెట్టుబడులు రాని స్థితికి రాష్ట్రం వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెచ్చగొట్టేలా విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ పాలసీ ప్రకారమే స్పందించి తేడా చూపించారు.