నివార్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలంటూ ఇప్పటికే ఓసారి జిల్లాలను పర్యటించిన పవన్ కల్యాణ్.. ఓసారి దీక్ష చేశారు. ఇప్పుడు మరింత ముందుకెళ్లారు. కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇరవై ఎనిమిదో తేదీన అన్ని కలెక్టరేట్ల ఎదుట.. జనసేన నేతలు ధర్నాలు చేయబోతున్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఉన్న మచిలీపట్నంలో ఆయన ధర్నాలో పాల్గొంటారు. తరవాత కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తారు.
పవన్ కల్యాణ్ ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగడంతో..జనసేన క్యాడర్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ పెద్దగా ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడు మళ్లీ తీరిక చేసుకుంటున్నారు. నివర్ తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని… పవన్ కల్యాణ్ ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు.. రూ. 30వేల వరకూ పరిహారం ఇస్తేనే రైతులు ధైర్యంగా ఉంటారని.. ఒడ్డున పడతారని ఆయన అంటున్నారు. తక్షణ సాయంగా పదివేలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాణ్ డిమాండ్‌ను కనీసం పట్టించుకోలేదు. రైతులకు ఎలాంటి సాయం ప్రకటించలేదు. కేవలం ఇన్పుట్ సబ్సిడీ రూ. 700 కోట్లు ఇస్తామని చెబుతోంది. దీంతో రైతులకు.. నివార్ తుపాన్ సాయం అందే అవకాశం కనిపించడం లేదు.
ప్రజాపోరాటాలు చేస్తేనే… పార్టీలో ఊపు వస్తుందని.. జనసేన నేతలు భావిస్తున్నారు. లాక్ డౌన్‌కు ముందు ఇసుక సమస్యపై విశాఖలో మార్చ్ నిర్వహించారు. తర్వాత సైలెంటయ్యారు. ఈ సారి అలాంటి మార్చ్‌ల కన్నా… అన్ని చోట్లా జనసేన కార్యకర్తలను యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. తుపాను బాధిత జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు నిర్ణయించారు. పవన్ కల్యాణ్.. ఇలా ఎప్పుడూ… తన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే… క్యాడర్లో కూడా నమ్మకం పెరుగుతుందన్న అభిప్రాయం జనసేనలో వినిపిస్తోంది.