ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కోల్పోయిన ఈ-సేవ ఉద్యోగుల కోసం పవన్ కల్యాణ్ గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈసేవ కేంద్రాల్లో లభించే సేవలన్నింటినీ వాటికి బదలాయించింది. దాంతో ఈ సేవ కేంద్రాలు చాలావరకూ మూతపడ్డాయి. వాటిల్లోపని చేస్తున్న వారికి..వాటిని పెట్టుకుని ఉపాధి పొందుతున్న వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. వారందా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అదే సమయంలో కరోనా లాక్ డౌన్ రావడంతో… అక్కడ పని చేస్తున్న వారికి జీతాలు కూడా ఇవ్వడం లేదు. వీరి గురించి ఏ ఒక్క రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. జనసేన అధినేత వీరి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఈ-సేవ కేంద్రాల్లో వివిధ ఉద్యోగాల్లో 607 మంది ఉన్నారని… వీరంతా నెలల తరబడి జీతాలు రాకపోవడం మూలంగా కష్ట, నష్టాల్లో ఉన్నారుని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి రాసిన బహిరంగలేఖలో పేర్కొన్నారు. కుటుంబాలు పోషణకు ధీమా … ఉపాధికి హామీ లేక ఆవేదనలో ఉన్నారుని.. 17 సంవత్సరాల నుంచి ఈ-సేవ ఉద్యోగాలను నమ్ముకొని బతుకుతున్న వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సంబంధించిన వందల సేవలను అందిస్తున్న ఈ-సేవ కేంద్రాలను, అందులోని ఉద్యోగుల పరిస్థితి గందరగోళపరచడం భావ్యం కాదని జనసేనాధినేత అంటున్నారు.
ఈ-సేవ కేంద్రాల ద్వారా సేవా రుసుముల రూపేణా రూ.వేల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతోందని… ఈ కేంద్రాలకు సంబంధించిన విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్ సర్వీసెస్ పరిధిలో తీసుకొని వారి ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే పవన్ కల్యాణ్ చాలా రోజులుగా వివిధ వర్గాల సమస్యలపై గళమెత్తుతున్నారు. ఏ రోజు కూడా ప్రభుత్వం పవన్ కల్యాణ్ లేఖలపై స్పందించలేదు. ఈసేవా ఉద్యోగుల సమస్యలపైనా స్పందిస్తారన్న గ్యారంటీ లేదు.