తెలంగాణ జన సమితి పార్టీ.. కొద్ది నెలల కిందటే ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ తరపున నడిపించిన కోదండరాం ఈ పార్టీని ప్రారంభించారు. ఇప్పుడు ఆయన ఎన్నికల కమిషన్ దగ్గర తన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఎన్నికల గుర్తు కేటాయింపు విషయమై టీజేఎస్ నేతలు ఈసీని కలిశారు. రెండాకులు, పార, రైతు నాగలి సహా మొత్తం 10 గుర్తులను టీజేఎస్ నేతలు ఎన్నికల సంఘానికి సూచించారు. వీటిలో నుంచి ఇతర పార్టీల నుంచి అభ్యంతరం లేని గుర్తుకునుచూసి.. టీజేఎస్‌కు ఈసీ ఎన్నికల గుర్తు కేటాయిస్తుంది. మరి పవన్ కల్యాణ్ జనసేన సంగతేమిటి..? ఆ పార్టీ ఎన్నికల గుర్తేమిటి..?
పార్టీ ప్రారంభించి ఐదేళ్లవుతోంది. కానీ పవన్ కల్యాణ్.. తన పార్టీ తరపున ఎన్నికల గుర్తేమిటో స్పష్టంగా .. అధికారికంగా.. ఈసీ దగ్గర నుంచి పొంద లేకపోయారు. ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చేశాయి. తెలంగాణ ఎన్నికల గురించి పవన్ పట్టించుకోవడం లేదు. ఏలూరులో పోరాటయాత్ర చేస్తున్నారు. అయినప్పటికీ.. తన పార్టీ తరపున బరిలోకి దిగడానికి ఔత్సాహికులు కచ్చితంగా ముందుకు వస్తారు. అప్పుడైనా పార్టీ గుర్తు కోసం.. ఈసీ దగ్గరకు పరుగెత్తాల్సిందే కదా. ఇప్పటివరకు కనీసం పార్టీ గుర్తు కోసం పవన్ చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటినుంచి ప్రయత్నిస్తే కానీ, ఎన్నికల నాటికి జనసేన కంటూ ఓ గుర్తు వస్తుంది. ఆ దిశగా అడుగులు వేయకపోతే, పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా, ఉమ్మడి గుర్తు మాత్రం రాదన్నది సుస్పష్టం. బిగించిన పిడికిలిని తన పార్టీ గుర్తుగా ప్రకటించినా అది.. ఎన్నికల సంఘం వద్ద ఉందో లేదో తెలియదు. ఉంటే.. దాన్ని తన పార్టీ కోసం కేటాయించమని దరఖాస్తు పెట్టుకోవాలి. ఒక వేళ లేకపోతే.. ఈసీ ఇచ్చే చాయిస్నుంచి తీసుకోవాలి.
ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. ఏపీలో మరో ఎడెనిమిది నెలలలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడెనిమిది నెలల్లో ఎన్నికల గుర్తు ఎప్పుడొస్తుందో తెలియదు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. ఎంత టెక్నాలజీని వాడుకున్నా, కిందిస్థాయిలోకి పార్టీ గుర్తు తీసుకెళ్లడం అంత సులువు కాదు. గ్రామగ్రామాల క్యాడర్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. పార్టీకి కామన్ సింబల్ కోసం పవన్ ఎప్పుడు ప్రయత్నిస్తారో, ఎప్పుడు అధికారికంగా ఫలానా గుర్తే మా జనసేన గుర్తని ఎప్పుడు చెప్తారో అన్న టెన్షన్ రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ గుర్తు విషయంలోనూ ఇదే జరిగింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఎన్నికల గుర్తు సుప్రీంకోర్టుకు వెళ్తే కానీ.. ఫైనల్ కాలేదు. అప్పుడే ఉమ్మడి గుర్తు వచ్చింది. ఆ అనుభవాలతోనైనా పవన్.. గుర్తు కోసం.. సీరియస్‌గా ఎందుకు ప్రయత్నించడం లేదో ఫ్యాన్స్‌కు అర్థం కావడం లేదు.