యుద్ధం చేయాల్సిన సమయంలో సామరస్యం అంటున్నారు. ఉద్యమించాల్సిన సమయంలో అధ్యయనాలు అంటున్నారు. లెక్కలు తేలిపోవాల్సిన సమయంలో లెక్కలేద్దాం అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జె.ఎఫ్.సి. ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి, ఈ కమిటీ ప్రకటన వినగానే.. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పవన్ పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నారనే అనుకున్నాం. కానీ, వరుసగా జె.ఎఫ్.సి. సమావేశాలు జరుగుతూ ఉండటం, కేంద్రం నుంచి పత్రాలు రావాలీ, రాష్ట్రం నుంచి సమాచారం వచ్చిందీ, దాని గురించి లెక్కలు మొదలయ్యాయనే హడావుడి… ఇప్పుడు ఇదంతా గమనిస్తుంటే ఇదేదో సుదీర్ఘ ప్రక్రియ అన్నట్టుగా కనిపిస్తోంది. అయితే, పవన్ చేస్తున్న ప్రయత్నాన్నీ, జె.ఎఫ్.సి. ఉద్దేశాన్నీ విమర్శించాలన్నది ఇక్కడి ఉద్దేశం కాదు. వారు చేస్తున్నదంతా కచ్చితంగా మంచి ఉద్దేశంతోనే. అయితే, అత్యంత కీలకమైన ఈ సమయంలో తనకు తెలియకుండా పవన్ కల్యాణ్ కొంత రిలాక్స్ అయిపోతున్నారేమో అనేదే ఓ చిన్న ఆందోళన!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లెక్కలు స్పష్టంగానే ఉన్నాయి. అదనపు కేటాయింపులు రాలేదనీ, ఇచ్చిన హామీలు కేంద్రం అమలు చేయలేదన్నదే ఇప్పుడు సమస్య. అయితే, దీనిపై పోరాడేందుకు సమయం కూడా చాలా తక్కువే ఉంది. ఎన్నికల సీజన్ వచ్చేస్తోంది. ఇలాంటి సందర్భంలో లెక్కలు సరిచూసుకునేందుకు, చర్చోపచర్చలు పెట్టేందుకు కావాల్సినంత సమయం ఉందా అనేదే ప్రశ్న..? అంతిమంగా ఈ లెక్కలు పడిగట్టు కార్యక్రమం తరువాత ఏం జరుగుతుంది..? ఇప్పుడు తేలే ఈ లెక్కల ద్వారా కేంద్రం స్పందించే స్థాయిలో చర్యలు ఎలా ఉంటాయనేది ఖరారు కావాలంటే ఇంకా సమయం పడుతుంది. అన్నిటికీమించి.. కేంద్రాన్ని స్పందింపజేసే స్థాయి వరకూ ఈ ప్రయత్నం చేరుతుందా అనేదీ చర్చనీయమే. ఎందుకంటే, పవన్ ఏర్పాటు చేసిన జె.ఎఫ్.సి.లో సమస్యను పరిష్కరించాల్సిన పార్టీకి ప్రాతినిధ్యం లేదు, పోనీ.. సమస్యతో భాగస్వామ్యం ఉన్న పక్షమూ లేదు, ఈ సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత ఉన్న పార్టీ జాడ కూడా లేదు. అత్యంత కీలకమైన ఈ మూడు పార్టీల భాగస్వామ్యం జె.ఎఫ్.సి.లో లేకపోతే పవన్ ఆశిస్తున్నట్టుగా కేంద్రం స్పందించే పరిస్థితి ఎలా వస్తుంది..?
నిజానికి, ఈ కమిటీ ఏం సాధిస్తుందీ, ఎలా సాధిస్తుందనేది కాసేపు పక్కనపెడితే… పవన్ కల్యాణ్ ఒక్క పిలుపునిస్తే చాలు, ఉద్యమించేందుకు యువతరం సిద్ధంగా ఉంది. ఆయన పోరాటానికి బయలుదేరితే లక్షలమంది మద్దతుగా వస్తారు. ఆయన తల్చుకుంటే ఒక ఉద్యమాన్ని నిర్మించడం, నడిపించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమంత కష్టసాధ్యమైన వ్యవహారం కానే కాదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ అప్పట్లో ఏ సభ ఏర్పాటు చేసినా.. మాంచి దూకుడుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ దుమ్ము దులిపేసేవారు. కానీ, ఇప్పుడు ఆ ధోరణికి భిన్నంగా… కమిటీ పేరుతో కీలకమైన సమయంలో కాలయాపన చేస్తున్నారా అనే అనుమానాలూ రేక్కెత్తే ఆస్కారం ఇస్తున్నారు. అంతేకాదు, భాజపాపై తిరగబడాల్సిన ఈ కీలక సమయంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా… కేంద్రానికి ఇబ్బందికరమైన పరిస్థితిని రానీయకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదో ప్రయత్నం పవన్ చేస్తున్నార్లే అనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఏర్పడేలా ఒక మధ్యేమార్గాన్ని ఆయన ఎన్నుకున్నట్టుగా కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు.