జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమ టూర్.. బ్లాస్టింగ్ రేంజ్లో ప్రారంభమయింది. కడప గడ్డపై… జగన్మోహన్ రెడ్డిపై… తీవ్ర స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అందరి వాడుగా వ్యవహరించడం లేదు కాబట్టే.. తాను జగన్ రెడ్డి అని పిలుస్తున్నానని… ఎలుగెత్తి ప్రకటించారు. పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటన .. కడప జిల్లా నుంచే ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కల్యాణ్… జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతరుల పట్ల హుందాగా మాట్లాడాలని… జగన్ కు చెప్పాలని వైసీపీ నేతలకు సలహా ఇచ్చారు.
కడప ప్రజలకు ఉపాధి దొరకకపోవడానికి.. రాజకీయ నేతలే కారణమని మండిపడ్డారు. ఉపాధి కావాలని అడిగితే.. అణుశుద్ధి కార్మగారాలను తీసుకు వచ్చి ప్రజల జీవితాలను దుర్భరం చేశారని మండిపడ్డారు. పథకాలు అమలు చేయడానికి భూములు అమ్మాలని జగన్ నిర్ణయించడంపై.. పవన్ మండిపడ్డారు. ప్రకృతిని కూడా అమ్మేయండని.. విరుచుకుపడ్డారు. మీ కాలం ఎల్లకాలం ఉండదని.. మన రోజులు వస్తాయని… ప్రజలకు పవన్ కల్యాణ్ ధైర్య ంచెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం.. సైలెంట్ గా ఉండటంపైనా విరుచుకుపడ్డారు. ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే.. జగన్ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. హోదాపై మోదీని అడిగే ధైర్యం జగన్కు లేదని విమర్శించారు.
రాయలసీమ సంస్కృతి అంటే పగలు, ప్రతీకారాలు కాదన్నారు. రాయలసీమలో సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని పవన్ ప్రకటించారు. తొలిసారి కడప జిల్లాలోనే తెలుగు శాసనాలు లభ్యమయ్యాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలుగు మీడియం రద్దు విషయాన్ని ఆ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత రాయలసీమ పర్యటనకు వెళ్లారు. సీమలో చాలా నియోజకవర్గాల్లో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయినప్పటికీ కడపలో ఆయన పర్యటనకు జనం వెల్లువెత్తారు. ఆ జన ఉత్సాహాన్ని చూసి..జగన్ పై పవన్ మరింత ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు.